Begin typing your search above and press return to search.

ఇదేం ఎంపిక.. ఇదేం జట్టు.. ఇదేం లక్ష్యం.. అంత తొందరేల బీసీసీఐ?

తాజాగా.. ఆస్ట్రేలియా సిరీస్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన తీరును చూస్తే ఇదే నిజం అనిపించక మానదు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 10:17 AM GMT
ఇదేం ఎంపిక.. ఇదేం జట్టు.. ఇదేం లక్ష్యం.. అంత తొందరేల బీసీసీఐ?
X

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు.. ఓవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. మరోవైపు బలమైన జాతీయ జట్టు.. మనతో సిరీస్ ఆడితే అవతలి దేశానికి కాసుల వర్షం.. బీసీసీఐ ఇప్పుడు ఏం చెబితే మిగతా క్రికెట్ ప్రపంచానికి అదే శాసనం.. అలాంటి బీసీసీఐ అప్పుడప్పుడు కాస్త తిక్క నిర్ణయాలు తీసుకుంటుందా? అనిపిస్తుంది. తాజాగా.. ఆస్ట్రేలియా సిరీస్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన తీరును చూస్తే ఇదే నిజం అనిపించక మానదు.

ముందే ఎందుకు?

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆ టెస్టును ఓడిపోయింది. పిచ్ పేస్ కు అనూహ్యంగా అనుకూలించిందని, టీమ్ ఇండియాకు పరిస్థితులు కలిసిరాలేదని భావించినా రెండో టెస్టులోనూ మన జట్టు ఆట తీరేమీ మారలేదు. ఇంకా మూడో టెస్టు కూడా జరగాల్సి ఉంది. ఈలోగానే శుక్రవారం రాత్రి ఆస్ట్రేలియాలో పర్యటించే టీమ్ ఇండియా జట్టును ప్రకటించేసింది బీసీసీఐ. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా వచ్చే నెల 22 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. అంటే దాదాపు నెల రోజుల సమయం ఉంది.

ఇక్కడ తీసేసి అక్కడ ఆడిస్తారా?

ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ తొలి టెస్టులో విఫలమయ్యాడని టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ను రెండో టెస్టుకు తప్పించారు. కానీ, అతడిని ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేశారు. హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ సంగతి కూడా అంతే. ఇక సూపర్ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న మయాంక్ యాదవ్ ను మొన్నటి బంగ్లాదేశ్ టి20 సిరీస్ లో ఆడించారు. కానీ, అచ్చమైన పేస్ బౌలింగ్ పిచ్ లు ఉండే ఆస్ట్రేలియా వంటి దేశంలో 150 కిలోమీటర్ల నిలకడైన వేగంతో బంతులు వేసే మయాంక్ ను మాత్రం తీసుకోలేదు. మరోవైపు గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తున్న స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని మాత్రం ఆస్ట్రేలియా టూర్ కు పరిగణనలోకి తీసుకోలేదు.

అభిమన్యుకు పిలుపు ఒక్కటే..

ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఉత్తరాఖండ్ ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ను ఎంపిక చేయడం మంచిదే. ఎంతోకాలంగా జట్టులో చోటుకు అతడు పోటీదారుగా ఉన్నాడు. పైగా ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు కొట్టాడు. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, సుందర్ ముగ్గురిని తీసుకున్నారు. స్టార్ పేసర్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ప్రకటించడం చూస్తుంటే భవిష్యత్ లో టెస్టు కెప్టెన్ బుమ్రానే అని భావించాల్సి ఉంటుంది. ఇతడికి తోడుగా సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ క్రిష్ణ, హర్షిత్ రాణాలలో ఎవరు కొత్త బంతిని పంచుకుంటారో చూడాలి.