Begin typing your search above and press return to search.

బీసీసీఐ 'పన్ను' చూస్తే.. కన్నుకుట్టాల్సిందే

ఇదే సమయంలో రిటర్న్ ల ఆధారంగా ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయ వ్యయాలను వెల్లడించారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 8:42 AM GMT
బీసీసీఐ పన్ను చూస్తే.. కన్నుకుట్టాల్సిందే
X

అంతులేని ఎవరి సంపదనైనా చూస్తే కళ్లు కుట్టడం సహజం. కానీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కట్టే ఆదాయ పన్ను గురించి విన్నా చాలు కన్ను కడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అనే బరువైన ట్యాగ్ ను మోస్తూ వస్తున్న.. మరో దశాబ్దం పాటు కూడా మోయనున్న బీసీసీఐ 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి కట్టిన ఆదాయ పన్ను గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. కొవిడ్ దెబ్బతో ఇబ్బంది పడినప్పటికీ మన బోర్డు చెల్లించిన పన్ను కళ్లుచెదిరే నంబరే.

అంతేకాదు.. కొన్ని బోర్డుల ఏడాది ఆదాయం కూడా దీని ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏడాది ఆదాయంలో భారత క్రికెట్ బోర్డు వాటనే 231 మిలియన్ డాలర్లు (2024-27 సైకిల్ కు). రూపాయిల్లో చెప్పాలంటే ఇది రూ. 2 వేల కోట్లు. మొత్తం ఆదాయంలో 38.5 శాతం. ఐసీసీ ఆదాయంలో 70 నుంచి 80 శాతం వాటా భారత మార్కెట్ దే.

రెండేళ్ల కిందటే రూ.1100 కోట్లు 2021-22 సంవత్సరం కొవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. విదేశీ పర్యటనలు, టోర్నీలు కూడా పెద్దగా సాగలేదు. కానీ ఆ ఏడాదిలో భారత క్రికెట్ బోర్డు చెల్లించిన ఆదాయ పన్ను రూ.1,159 కోట్లు. ఈ విషయం అల్లటప్పాగా చెబుతున్నది కాదు. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వివరాలు తెలిపారు. ఇదే సమయంలో రిటర్న్ ల ఆధారంగా ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయ వ్యయాలను వెల్లడించారు. అయితే, బీసీసీఐ ఆదాయంలో ఐసీసీ నుంచి వచ్చిన, వచ్చే వాటా నామమాత్రమే.

ఒకవిధంగా చెప్పాలంటే ఏడాది ఆదాయ పన్నుకు రెట్టింపు మాత్రమే. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.844.92 కోట్లు, 2019-20లో రూ.882.29 కోట్ల ఆదాయ పన్ను చెల్లించింది. ఒక్క ఏడాదిలోనే రూ.300 కోట్లు ఎక్కువ పన్ను చెల్లించింది.

ఇక 2018-19లో రూ.814 కోట్లు, 2017-18లో రూ.596.63 కోట్లను ఆదాయ పన్ను కింద బీసీసీఐ కట్టింది. అయిదేళ్ల కిందటితో పోలిస్తే బోర్డు చెల్లించిన ఆదాయ పన్ను రెట్టింపు కావడం విశేషం. ఇక 2021-22లో బీసీసీఐ రూ.7,606 కోట్ల ఆదాయం ఆర్జించి.. రూ.3,064 కోట్లు వ్యయం చేసింది. 2020-21లో రూ.4,735 కోట్లు ఆర్జించి రూ.3,080 కోట్లు ఖర్చు పెట్టింది.

అంతా ఐపీఎల్ మాయ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ దశనే మార్చింది. బీసీసీఐ రాతనూ మార్చింది. స్పాన్సర్ షిప్ లు, ఆటగాళ్ల స్థాయిని బట్టి ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ లీగ్ ఐపీఎల్. ఐసీసీ ఆదాయంలో సింహభాగం మన నుంచే. 2016 టి20 ప్రపంచ కప్ సమయంలో బీసీసీఐ రూ.193 కోట్లను పన్ను కింద కట్టింది. అందులోనూ మరో రెండు నెలల్లో భారత్ లో ప్రపంచ కప్ మొదలుకానుంది. లక్షలాదిగా అభిమానులు పోటెత్తే స్టేడియాలు.. వేల కోట్ల విలువైన ప్రకటనలు.. ఇంకేం..? ఇక ఈ ఆదాయం మరింత పెరగడం ఖాయం.