ప్లీజ్.. హెడ్ కోచ్ గా మరో ఏడాదైనా ఉండు.. బీసీసీఐ
ప్రపంచ కప్ గెలుపోటములతో సంబంధం లేకుండా ద్రవిడ్ కాంట్రాక్టును మరో రెండేళ్లు పొడిగిస్తామని బీసీసీఐ చెబుతోంది.
By: Tupaki Desk | 29 Nov 2023 6:57 AM GMTక్రికెట్ లో ప్రతిసారి పెద్ద టోర్నీలు ముగిశాక చర్చ జరిగేది కోచ్, కెప్టెన్ భవితవ్యంపైనే.. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. టోర్నీ గెలిచినంత మాత్రానే కోచ్, కెప్టెన్ పదవులు అలానే ఉంటాయని చెప్పలేం. కాంట్రాక్టు ముగియడంతో కొందరు తప్పుకొంటారు. ఇక వైఫల్యం ఎదురైతే.. కోచ్, కెప్టెన్ పని ఖతం. వేరే దిక్కులేదని భావిస్తే తప్ప వారిని కొనసాగించరు. ఇప్పుడు ఈ పరిస్థితే టీమిండియా హెడ్ కోచ్ కు ఎదురవుతోంది.
నువ్వుండాలి..
భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండడం అంటే మామూలు కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్లకు కోచింగ్ ఇవ్వడం ఉంటుందా..? అలాంటివారికి ఏదైనా చెప్పాలంటే అవతలి వ్యక్తి వారి కంటే ప్రతిభావంతుడు అయి ఉండాలి. లేదంటే విశేషమైన నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇక టీమిండియాకు ప్రస్తుతం కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఈ అర్హతలన్నీ ఉన్నాయి. వాస్తవానికి వన్డే ప్రపంచ కప్ తో రాహుల్ ద్రవిడ్ టర్మ్ పూర్తయింది. అందులోనూ మన జట్టు కప్ కొట్టనందున ద్రవిడ్ తప్పుకొంటారనే వాదన వినిపిస్తోంది. కానీ, బీసీసీఐ మరోలా ఆలోచిస్తోంది. ద్రవిడ్ ను మరో రెండేళ్లయినా కొనసాగమంటోంది. అదీ కుదరకపోతే కనీసం ఏడాదైనా కోచింగ్ చేయమంటోంది.
టి20 ప్రపంచ కప్ నాటికైనా..
ప్రపంచ కప్ గెలుపోటములతో సంబంధం లేకుండా ద్రవిడ్ కాంట్రాక్టును మరో రెండేళ్లు పొడిగిస్తామని బీసీసీఐ చెబుతోంది. కానీ, ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆయన మాత్రం కొనసాగడానికి ఇష్టపడడం లేదు. దీంతో బీసీసీఐ మరో మెట్టు కూడా దిగింది. వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్ వరకైనా ఉండమని బతిమాలుతోంది. ఇందుకు అతడు అంగీకరిస్తే.. వన్డే ప్రపంచకప్ వరకు ఉన్న సహాయక సిబ్బంది కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ గా పరాస్ మాంబ్రేకు కాంట్రాక్ట్ పొడిగింపు లభించనుంది.
చీఫ్ సెలక్టర్, కెప్టెన్ ఓకే..
ద్రవిడ్ వంటి జెంటిల్ మన్, ప్రొఫెషనల్ క్రికెటర్ కు వంక పెట్టడానికి ఏముంటుంది? అందుకే ద్రవిడ్ ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా మద్దతుగా నిలిచారు. కాగా, ఇక్కడో కీలక అంశం ఏమంటే.. ద్రవిడ్ ను క్లిష్టమైన దక్షిణాఫ్రికా టూర్ కు పంపాలని, ఇప్పటివరకు సిరీస్ గెలవని చోట జయకేతనం ఎగురవేయాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే నెల 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ముందుగా ఈ సిరీస్ లో టి20లు ఆడనున్నారు. వీటికి కాకపోయిన వన్డే సిరీస్ వరకైనా జట్టుతో కలవాలని ద్రవిడ్ ను బీసీసీఐ అభ్యర్థిస్తోంది.
హైదరాబాదీ లక్ష్మణ్ మరికొంతకాలం ఆగాల్సిందే..
ద్రవిడ్ పూర్తిగా ససేమిరా అంటే తప్ప హైదరాబాదీ లక్ష్మణ్ కు టీమిండియా హెడ్ కోచ్ గా చాన్స్ దక్కకపోవచ్చు. లక్ష్మణ్ ఇప్పటికే జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతల్లో ఉన్నాడు. అండర్- 19 జాతీయ జట్టు కోచ్ కూడా. ఈ విభాగంలో ప్రపంచ కప్ జరగనున్నందున లక్ష్మణ్ ను దక్షిణాఫ్రికా పంపలేరు. అయితే, ద్రవిడ్ పూర్తిగా తప్పుకొంటే తప్పనిసరిగా లక్ష్మణ్ కే టీమిండియా కోచింగ్ బాధ్యత దక్కుతుంది.