గంభీర్ దూకుడుకు బీసీసీఐ బ్రేకు.. ఐదుగురిని కోరితే ఒక్కరికే చాన్స్
మైదానంలో దూకుడుగా.. బయట ముక్కుసూటిగా కనిపించే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వస్తూనే సంచలనం రేపేలా ఉన్నాడు
By: Tupaki Desk | 18 July 2024 10:30 AM GMTమైదానంలో దూకుడుగా.. బయట ముక్కుసూటిగా కనిపించే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా వస్తూనే సంచలనం రేపేలా ఉన్నాడు. తనదైన ముద్ర చూపాలనుకుంటూ కోచింగ్ స్టాఫ్ ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు పూనుకున్నాడు. ఐపీఎల్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున పనిచేసిన సమయంలో పరిచయమో.. తన సొంత టీమ్ ఉండాలని భావించడమో..? మరే కారణమో కానీ కొందరి పేర్లను బీసీసీఐకి ప్రతిపాదించాడు. కానీ, బీసీసీఐ ఏమైనా తక్కువ తిన్నదా..?
ఆ ఐదుగురిలో..
హెడ్ కోచ్ గా తానుంటే.. బౌలింగ్ కోచ్ లుగా దక్షిణాప్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్, భారత మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ, ఫీల్డింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మేటి ఫీల్డర్ జాంటీ రోడ్స్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ లను ఇవ్వాలని బీసీసీఐని గంభీర్ కోరాడట. కానీ, బోర్డు మాత్రం వీరిలో నాయర్ ఒక్కడి వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. కాగా, మోర్కెల్, బాలాజీ గతంలో కోల్ కతాకు ఆడారు. రోడ్స్ మాత్రం ముంబైకు పనిచేశాడు. నాయర్ అయితే గంభీర్ లాగానే కోల్ కతా నైట్ రైడర్స్ బాధ్యతలు నిర్వర్తించాడు.
స్వేచ్ఛ ఇస్తే ఇబ్బందనా..?
టీమ్ ఇండియాలో మరీ ముఖ్యంగా టి20ల్లో కొత్త రూపు సంతరించుకోనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రధానమైన హెడ్ కోచ్ పదవిలోకి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వచ్చాడు. వచ్చే శ్రీలంక సిరీస్ నుంచి అతడు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే, గంభీర్ మాత్రం కొన్ని డిమాండ్లు పెట్టాడు. ముఖ్యంగా కోచింగ్ స్టాఫ్ విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరాడనే కథనాలు మొదట్లోనే వచ్చాయి. కానీ, బీసీసీఐ మాత్రం అంత స్వేచ్ఛ ఇవ్వొద్దని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, గంభీర్ పదవీ కాలం మూడున్నరేళ్లు. ఈ సమయంలో జట్టులో చాలా మార్పులు జరుగుతాయి. కోహ్లి, రోహిత్, జడేజా, అశ్విన్, షమీ తదితరులు రిటైర్ అవుతారు. వీరి స్థానాలను భర్తీ చేస్తూ మేటి జట్టుగా ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను అతడు కాపాడాల్సి ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.