Begin typing your search above and press return to search.

ఆ రెండు స్టేడియాల్లో ‘‘దీపావళి’’ లేనట్టే.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ దాదాపు మూడొంతులు పూర్తి అయింది. గురువారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే 32వది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:24 PM GMT
ఆ రెండు స్టేడియాల్లో ‘‘దీపావళి’’ లేనట్టే.. బీసీసీఐ కీలక నిర్ణయం
X

భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ దాదాపు మూడొంతులు పూర్తి అయింది. గురువారం దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే 32వది. మరో 10 లీగ్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత రెండు సెమీఫైనల్స్, ఫైనల్ మాత్రమే. వెరసి మరొక్క 18 రోజులే క్రికెట్ సంబరం. ఇక టీమిండియా ఇప్పటికే ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలిచి సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం శ్రీలంకతో ముంబైలో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

పొగ చూరొద్దని..

దేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఢిల్లీ, ముంబై. ఒకటి పాలనా రాజధాని, మరొకటి ఆర్థిక రాజధాని కావడంతో ఇది సహజం. వాస్తవానికి ఢిల్లీలో వాహన కాలుష్యంతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన హరియాణ, పంజాబ్ లో పంట వ్యర్థాల దహనంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తుంటుంది. దీనికితోడు హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తర భారతంలొ చలి ప్రభావం అక్టోబరు నుంచే మొదలవుతుంది. ఇక ముంబైలో వాహన కాలుష్యం అధికం. కాగా, వన్డే ప్రపంచ కప్‌ లో మ్యాచ్‌ ఫలితం అనంతరం స్టేడియంలో పటాకాయలు పేలుస్తున్నారు. మ్యాచ్ మధ్యలో ఇన్నింగ్స్ ముగిశాక లైటింగ్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే లైటింగ్ షో తమకు తలనొప్పి వస్తోందని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ వాపోయాడు. అయితే, బాణసంచా కాల్చడం వల్ల కూడా కాలుష్యం పెరుగుతోందనే వాదనలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ, ముంబై వంటిచోట్ల టపాసులను పేల్చితే వాతావరణానికి మరింత హానికరమని అభిమానుల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఈ నగరాల్లో మ్యాచ్‌ ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బీసీసీఐ నిషేధం విధించింది.

ఢిల్లీ.. దీపావళి

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే దీపావళి పండుగ జరుపుకోవడంపై అనేక ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పర్యావరణ హితం రీత్యా చర్యలు తప్పడం లేదు. కాగా, ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం ఢిల్లీలో ఈ నెల 6న ఆఖరి మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇందులో బంగ్లాదేశ్-శ్రీలంక తలపడతాయి. మరోవైపు ముంబైలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ – శ్రీలంక, ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ ఆడాల్సి ఉంది. తొలి సెమీ ఫైనల్స్ కు కూడా ముంబైలోని వాంఖడే మైదానమే వేదిక. ఇప్పుడు క్రాకర్స్ కాల్చడంపై నిషేధం విధించడంతో ఈ మైదానాల్లో మ్యాచ్ ముగిశాక సందడి లేనట్లే.

కొసమెరుపు: ముంబైలో భారత్-శ్రీలంక గురువారం తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ (బహుశా భారత్-మరో జట్టు) కూడా ఇక్కడే జరగాల్సి ఉంది. అంటే భారత్ విజయం సాధించే (బహుశా) రెండు మ్యాచ్ లకూ బాణ సంచా సంబరం లేనట్లే అన్నమాట.