బెంగళూరు వర్సెస్ లక్నో... నమోదైన రికార్డ్స్ ఇవే!
ఇక తాజా మ్యాచ్ లో మరింత ఆసక్తికరమైన ఘణాంకాలను నమోదు చేశాడు మయంక్. ఆడుతున్న తన రెండో ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు బ్యాటర్స్ ని బెంబేలెత్తించాడు
By: Tupaki Desk | 3 April 2024 3:46 AM GMTచినస్వామీ స్టేడియం వేదికగా తాజా ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 15.. బెంగళూరు – లక్నో మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బెంగళూరును లక్నో 28 పరుగుల తేడాతో ఓడించింది. ఆద్యాంతం లఖ్ నవూ పై చేయిగానే సాగిన ఈ మ్యాచ్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో భాగంగా పలు రికార్డ్ లు నమోదయ్యాయి.
అవును... బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో టీం లో ఓపెనర్ డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో భాగంగా... 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 81 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో రీస్ టాస్లీ వేసిన ఏడో ఓవర్ లో మూడు రన్స్ చేసిన డికాక్... ఐపీఎల్ లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో... ఈ జాబితాలో టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ లో తక్కువ ఇన్నింగ్స్ ల్లో 3 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు:
క్రిస్ గేల్ - 75
కేఏల్ రాహుల్ - 80
జోస్ బట్లర్ - 85
డెవిడ్ వార్నర్ / ఫాఫ్ డుప్లెసిస్ - 94
క్వింటన్ డికాక్ - 99 మ్యాచ్ లలో 3000 ల పరుగుల మైలురాయిని చేరుకున్నారు!
ఇదే క్రమంలో ఈ మ్యాచ్ లో ఒక భారీ సిక్సర్ నమోదైంది. ఇందులో భాగంగా... రీస్ టాస్లీ వేసిన 19 ఓవర్ లో నికోలస్ పూరన్ బాదిన ఒక సిక్స్ స్టేడియం పైకప్పుపై పడింది. ఇది 106 మీటర్ల సిక్స్ కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకూ ఈ సీజన్ లో లాంగెస్ట్ సిక్సర్ గా నిలిచింది.
మయంక్ యాదవ్ సంచలన బౌలింగ్:
ఇక ఈ తాజా మ్యాచ్ లో అత్యంత ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి... లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మయంక్ యాదవ్! ఐపీఎల్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ పై వేసిన 4 ఓవర్లలో... 12 డాట్ బాల్స్ వేసి 27 పరుగులు ఇచ్చాడు. అంతకంటే ప్రధానంగా... 3 వికెట్లు తీసి పంజాబ్ టాప్ ఆర్డర్ ని పెవిలియన్ కు పంపాడు. దీంతో... ఆ మ్యాచ్ లో మయంక్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు.
ఇక తాజా మ్యాచ్ లో మరింత ఆసక్తికరమైన ఘణాంకాలను నమోదు చేశాడు మయంక్. ఆడుతున్న తన రెండో ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు బ్యాటర్స్ ని బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్ లో వేసిన 4 ఓవర్లలో 17 డాట్ బాల్స్ కాగా.. 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండటం. దీంతో.. ఈ మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఇతడినే వరించింది.
దీంతో... ఐపీఎల్ హిస్టరీలో ఆడిన మొదటి రెండు మ్యాచ్ లలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న తొలి ప్లేయర్ గా మయంక్ యాదవ్ రికార్డ్ సృష్టించాడు.
ఇదే సమయంలో... చినస్వామి స్టేడియంలో విరాట్ కొహ్లీకి ఇది 100వ మ్యాచ్ కాగా.. ఈ సీజన్ లో ఆలౌటైన మొట్ట మొదటి జట్టుగా బెంగళూరు నిలిచింది!