Begin typing your search above and press return to search.

33 ఏళ్లకే టీమిండియా రిటైర్మెంట్ బాటలో సీనియర్ పేసర్

కళ్లు చెదిరే ఇన్ స్వింగింగ్ డెలివరీలు సంధించే టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్

By:  Tupaki Desk   |   29 July 2023 8:07 AM GMT
33 ఏళ్లకే టీమిండియా రిటైర్మెంట్ బాటలో సీనియర్ పేసర్
X

అతడో స్వింగ్ బౌలర్.. వాతావరణం అనుకూలించే ఇంగ్లండ్ లాంటిచోట తనదైన శైలిలో చెలరేగేవాడు. రివ్వుమంటూ దూసుకొచ్చే బంతులతో బ్యాట్స్ మన్ ఆటకట్టించేవాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన ఘనత అతడి సొంతం. టి20ల్లోనూ వేసిన తొలి ఓవర్ లోనే (6వ బంతికి) వికెట్ పడగొట్టిన రికార్డు అతడిది. ఇవి రెండూ క్లీన్ బౌల్డ్ లే కావడం అతడి స్వింగ్ పవర్ ను తెలియజేస్తుంది.

బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడమే కాదు.. కళ్లు చెదిరే ఇన్ స్వింగింగ్ డెలివరీలు సంధించే టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన భువీ తన ఇన్‌స్టా ప్రొఫైల్ నుంచి 'క్రికెటర్' అన్న పదం తొలగించడం చర్చనీయాంశమవుతోంది. గతంలో భువీ ప్రొఫైల్‌ లో 'ఇండియన్ క్రికెటర్' అని ఉండేది. శుక్రవారం అతడు దానిని 'ఇండియన్‌ ' అని మార్చాడు. దీంతో భువి అంతర్జాతీయ కెరీర్‌ కు తెరపడినట్లేపన్న ఊహాగానాలు పెరిగాయి.

కత్తెర పరిశ్రమకు పేరుగాంచి యూపీలోని మేరట్ లో జన్మించిన భువీ వయసు 33 ఏళ్లే. 1990లో పుట్టిన అతడు 2012లో టీమిండియా తరఫున అంతర్జపాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. జహీర్ ఖాన్, నెహ్రా తదితరులు రిటైర్మంట్ కు దగ్గర్లో ఉన్న సమయంలో భువీ పేస్ బౌలింగ్ వనరుల కొరతను తీర్చే వాడి కనిపించాడు. పెద్దగా పేస్‌ లేనప్పటికీ స్వింగ్‌ భువీ బలం. విధ్వంసకర ఇన్‌ స్వింగర్‌ అందులో మరీ ప్రత్యేకం.

2012 డిసెంబరులో పాకిస్థాన్ తో బెంగళూరులో ఆడిన తన మొదటి టి20 తొలి ఓవర్ చివరి బంతికి నసీర్ జంషెడ్‌ ను ఇలాంటి ఇన్ స్వింగర్ తోనే బౌల్డ్ చేశాడు. అతడి తొలి వన్డే వికెట్ అయితే మరీ ప్రత్యేకం. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ మహ్మద్ హఫీజ్‌ ను బౌల్డ్ చేశాడు. అటు తొలి టెస్టు సిరీస్ (2013లో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్‌)లో భారత్ తొలిసారిగా వైట్‌ వాష్ సాధించడంలో భువీది కీలక పాత్ర.

సచిన్ ను డకౌట్ చేసి వెలుగులోకి

కచ్చితమై లైన్-లెంగ్త్ తో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ ను డకౌట్ చేయడం ద్వారా 2008-09 రంజీ ట్రోఫీ ఫైనల్‌ లో భువీ వెలుగులోకి వచ్చాడు. అప్పటికి అతడి వయసు 19 ఏళ్లే. కాగా, 2014లో టీమిండియాకు పీడకల మిగిల్చిన ఇంగ్లండ్ పర్యటన లో భువీ మాత్రం మెరిశాడు. మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఇందులో చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 82 పరుగులకు 6 వికెట్లు సాధించడం విశేషం.

కాగా, ఆస్ట్రేలియాలో చీలమండ గాయానికి గురై 2015లో భువీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. నిరుడు నవంబరులో న్యూజిలాండ్‌ తో టీ20లో చివరిసారిగా భారత్‌ కు ఆడాడు.

ఐపీఎల్ లో హైదరాబాదీ..

భువనేశ్వర్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బౌలర్. జట్టు టైటిల్ సాధించడంలో భువీది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్‌ లోనూ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 14 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌ లో పర్యటిస్తున్న భారత జట్టులో చోటు దక్కలేదు. ఈనేపథ్యంలో భువి ఇన్‌ స్టా ప్రొఫైల్‌ లో మార్పునకు ప్రాధాన్యం ఏర్పడింది.