టీమిండియా స్టార్ డకౌట్ పై బార్మీ ఆర్మీ దారుణ ట్రోలింగ్.. బూమరాంగ్
ఇప్పుడిక అసలు విషయానికి వస్తే, భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సున్నా (డకౌట్) అయ్యాడు. 9 బంతులు ఆడిన కోహ్లి ఖాతా తెరవలేకపోయాడు.
By: Tupaki Desk | 30 Oct 2023 4:09 AM GMTవలస పాలన తాలూకు ఆనవాళ్లో.. లేక జాతి కారణంగా వచ్చిన దురహంకారమో.. క్రికెట్ లో తామే మొనగాళ్లమనే మిడిసిపాటో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వీరాభిమానులు విర్రవీగుతుంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేయడం.. ప్రత్యర్థి జట్లను చిన్న చూపు చూడడం వారి జీన్స్ లోనే ఉందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ.. ఓ 15-20 ఏళ్ల కిందట అయితే మరీ దుందుడుకుగా ఉండేవారు వెస్ట్రన్ కంట్రీస్ అభిమానులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాకతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆర్థికంగా అమేయ శక్తిగా ఎదిగింది. ఇదే సమయంలో ఇతర దేశాల బోర్డులకు వారి ఆటగాళ్లను ఐపీఎల్ వైపు చూడకుండా ఆపడమే కష్టమవుతోంది. ఇప్పుడిక అసలు విషయానికి వస్తే, భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సున్నా (డకౌట్) అయ్యాడు. 9 బంతులు ఆడిన కోహ్లి ఖాతా తెరవలేకపోయాడు.
అద్భుత ఫామ్ లో ఉన్న ప్లేయర్
వాస్తవానికి ఈ ప్రపంచ కప్ లో కోహ్లి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో 85 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తర్వాత అఫ్ఘానిస్థాన్ అజేయంగా 55 పరుగులు చేశాడు. పాకిస్థాన్ పై 16 పరుగులకే ఔటైనా, బంగ్లాదేశ్ పై సెంచరీ తో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ పై 95 పరుగుల వద్ద ఔటయి వరుసగా రెండో శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ తో లక్నో లో జరిగిన మ్యాచ్ లో మాత్రం కోహ్లి డకౌట్ గా వెనుదిరిగాడు. యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో వచ్చిన కోహ్లి 9 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయి మిడాఫ్ లోకి షాట్ కొట్టబోయి కవర్స్ లో క్యాచ్ ఇచ్చాడు.
ప్రపంచ కప్ లో ఇదే తొలి డక్
2011, 2015, 2019, 2023.. అంటే ఇది కోహ్లికి నాలుగో వరల్డ్ కప్. బహుశా చివరిది కూడా. ఈ నవంబరు 5తో 35 ఏళ్లు నిండనున్న కోహ్లి వచ్చే ప్రపంచ కప్ ఆడడం కష్టమే. అప్పటికి అతడికి 39 ఏళ్లు వస్తాయి. కాబట్టి ఇదే చివరి ప్రపంచ కప్ అని చెప్పొచ్చు. కోహ్లి ఆడిన తొలి ప్రపంచ కప్ (2011)నే టీమిండియా గెలుచుకుంది. ఆ తర్వాత రెండు సార్లూ సెమీఫైనల్స్ చేరింది. ఇప్పుడు కూడా సెమీస్ కు వెళ్లడం ఖాయమైంది. ఇన్ని ప్రపంచ కప్ లలో కోహ్లీ ఏనాడు డకౌట్ కాకపోవడం గమనార్హం. అయితే, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మాత్రం ఖాతా తెరవలేకపోయాడు. దీంతోనే ఇంగ్లండ్ దురభిమాన సంఘమైన ‘‘బార్మీ ఆర్మీ’’ ఎగతాళికి దిగింది. సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టింది. కోహ్లి డకౌట్ ను వెక్కిరిస్తూ నీటిలో ఈదుతున్న బాతు మెడ స్థానంలో కోహ్లి ఫొటోను ఉంచింది. కోహ్లి టెస్టు మ్యాచ్ లో గట్టిగా అప్పీల్ చేస్తున్న ఓ ఫొటోను తీసుకుని.. ‘‘కోహ్లి గాన్’’ అనే క్యాప్షన్ పెట్టింది.
రూట్ డకౌట్ తో బూమరాంగ్
కోహ్లి విషయంలో బార్మీ ఆర్మీ చేసిన వెక్కిరింత వారికే ఎదురుతన్నింది. టీమిండియా 229 పరుగులకు ఆలౌట్ అయ్యాక ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ను పేసర్లు బుమ్రా, షమీ దారుణంగా దెబ్బకొట్టారు. వారి బంతులను ఆడడం ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ తరం కాలేదు. ఈ క్రమంలో బుమ్రా అద్భుత బంతికి ఇంగ్లండ్ ఓపెనర్ మలన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్ బ్యాట్స్ మన్ మొదటి బంతికే జో రూట్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అంపైర్ కూడా అప్పీల్ చేయగానే ఔట్ ఇచ్చాడు. ఈ ఔట్ ను చూసిన ఎవరైనా, రూట్ ప్లంబ్ అయ్యాడని చెబుతారు. కానీ, అతడు రివ్యూకు వెళ్లి మరీ అభాసుపాలయ్యాడు. చివరకు సమీక్షలోనూ ఔట్ అని తేలడంతో వెనుదిరిగాడు.
కొసమెరుపు:
కోహ్లి డకౌట్ విషయంలో బార్మీ ఆర్మీ చేసిన ట్రోలింగ్ కు భారత అభిమానులు దీటుగానే బదులిచ్చారు. నీటిలో ఈదుతున్న బాతు మెడ స్థానంలో రూట్ ఫొటో తగిలించి గట్టి సమాధానమిచ్చారు. దీంతో ‘‘బార్మీ ఆర్మీ తిక్క కుదిరింది’’ అనే అభిప్రాయం వ్యక్తమైంది.