Begin typing your search above and press return to search.

బెట్టింగ్‌ వ్యవహారం... ఇంగ్లండ్‌ ఫాస్ట్ బౌలర్‌ పై నిషేధం!

అవును... ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ బెట్టింగ్ కి పాల్పడ్డాడనే వ్యవహారంపై నిషేదాన్ని ఎదుర్కోనున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 6:31 AM GMT
బెట్టింగ్‌  వ్యవహారం... ఇంగ్లండ్‌  ఫాస్ట్  బౌలర్‌  పై నిషేధం!
X

గతకొంతకాలంగా క్రీడను క్రీడగా ఆస్వాధించేవారి కంటే... దాని మాటున బెట్టింగ్ వ్యవహారాలు నడిపేవారే ఎక్కువ అనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా క్రికెట్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుందనే కామెంట్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో ప్రేక్షకులు పాల్గొనడం ఒకెత్తు అయితే... క్రీడాకారులే పాల్గొనడం భారీ నేరం! అలాంటి నేరానికే పాల్పడ్డాడు బ్రైడన్ కార్స్!

అవును... ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ బెట్టింగ్ కి పాల్పడ్డాడనే వ్యవహారంపై నిషేదాన్ని ఎదుర్కోనున్నాడు. ఇందులో భాగంగా... 2017 - 2019 మధ్యలో అతడు బెట్టింగ్‌ కు పాల్పడినట్లు రుజువు కావడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అతడిపై 16 నెలల నిషేధాన్ని విధించింది. ఇందులో 13 నెలల సస్పెన్షన్ రెండేళ్ల కాలానికి నిలిపివేయబడగా.. మూడు నెలల సస్పెన్షన్ మే 28 నుండి ఆగస్టు 28 - 2024 వరకు అమలులో ఉంటుంది.

దక్షిణాఫ్రికాలో జన్మించి, ఇంగ్లండ్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న 28 ఏళ్ల కార్స్‌ 2016లో డర్హమ్‌ కౌంటీలో అరంగేట్రం చేశాడు. అనంతరం 2021 నుంచి ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడి మొత్తంగా 19 వికెట్లు పడగొట్టాడు. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన కార్స్‌.. ఈమధ్య కాలంలో ఇంగ్లండ్‌ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారాడు.

2017 మరియు 2019 మధ్య జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌ లపై 303 బెట్‌ లు వేసిన వ్యవహారంలో కార్సే దోషిగా నిర్ధారించబడ్డాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... తాను పాల్గొన్న మ్యాచ్‌ ల్లో కాకుండా మిగతా మ్యాచ్‌ లపై మాత్రమే అతడు బెట్టింగ్‌ కాసాడని క్రికెట్‌ రెగ్యులేటర్‌ ఏసీబీ విచారణలో తేలింది. ఇదే సమయంలో... కార్సే తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని.. పశ్చాత్తాపం చూపించాడని ధృవీకరించారు.

ఇదిలా ఉంటే.. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌ జూన్‌ 4న ఆడనుంది. బార్బడోస్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ లో స్కాట్లాండ్‌ తో తలపడుతుంది.