Begin typing your search above and press return to search.

భారత 'పేసు' గుర్రమే.. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

మొత్తం 13 మ్యాచ్‌ లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. నిరుడు అత్యధిక వికెట్లు తీసింది అతడే కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 Jan 2025 1:00 AM IST
భారత పేసు గుర్రమే.. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
X

2024 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వన్డే జట్టులో భారత ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం నిరాశ పరిచి ఉండొచ్చు..నిరుటి మేటి టి20 జట్టుకు.. టి20ల నుంచి రిటైరైన కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించి ఆశ్చర్యపరిచి ఉండొచ్చు..టెస్టుల్లో ఘోర గత సంవత్సరం దారుణ పరాజయాలతో టీమ్ ఇండియా పేరు పోయి ఉండొచ్చు.. అయితే, చిట్టచివరకు మాత్రం ఐసీసీ ఓ సరైన ఎంపిక చేసింది.

పేస్, బౌన్స్, స్పిన్ వికెట్లు అని తేడా లేకుండా వికెట్ మీద వికెట్ తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను హడలెత్తిస్తున్న టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. అతడిని టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ప్రకటించారు.

ఇంగ్లండ్, శ్రీలంక బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్ లను కాదని బుమ్రాను ఐసీసీ టెస్టు క్రికెటర్ 2024గా ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్నఆరో భారత క్రికెటర్‌ బుమ్రానే కావడం విశేషం.

టీమ్ ఇండియా వాల్ గా ప్రసిద్ధి చెందిన రాహుల్ ద్రవిడ్ 2004లో, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ 2009లో, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2010లో, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన 500 వికెట్ల ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2016లో, మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ 2018లో ఐసీసీ టెస్టు క్రికెటర్లుగా ఎంపికయ్యారు.

కాగా, నిరుటి మేటి ఐసీసీ టెస్టు జట్టులోనూ బుమ్రాకు చోటిచ్చారు. ఇక 2024లో బుమ్రా అద్భుత బౌలింగ్‌ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. మొత్తం 13 మ్యాచ్‌ లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. నిరుడు అత్యధిక వికెట్లు తీసింది అతడే కావడం గమనార్హం.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ సిరీస్ లోనే బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్ చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో గాయంతో తప్పుకొన్నాడు. బుమ్రా గనుక బౌలింగ్ చేసి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదనే అభిప్రాయం ఉంది.

కాగా, భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గత సంవత్సరానికిగాను వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకుంది. పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు అఫ్గానిస్థాన్‌ ఆల్‌ రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ ఎంపికయ్యాడు.