పేసయినా.. స్పిన్నయినా.. వికెట్లు అతడికే.. బూమ్
6/45 & 3/46… ఇదీ విశాఖ టెస్టులో బుమ్రా ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్ లో అతడి యార్కర్ బంతికి ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ వికెట్లు చెల్లాచెదురయ్యాయి.
By: Tupaki Desk | 5 Feb 2024 4:30 PM GMTతెలుగు రాష్ట్రాల్లో టెస్టు క్రికెట్ సందడి ముగిసింది. జనవరి 25న హైదరాబాద్ లో మొదలైన టెస్టు మ్యాచ్ సందడి.. సోమవారం విశాఖపట్టణంలో పూర్తయిన టెస్టు వరకు సాగింది. ఇంగ్లండ్ లాంటి గట్టి ప్రత్యర్థితో.. అదికూడా ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లొ జరగడం అంటే విశేషమే. బీసీసీఐ రొటేషన్ ప్రకారం టెస్టు మ్యాచ్ లను ఆయా స్టేడియాలకు కేటాయిస్తుంది. హైదరాబాద్ లో చివరిసారిగా 2018లో మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత అంటే.. ఐదేళ్లకు ఇటీవల మరో అవకాశం చిక్కింది. ఇక విశాఖకు అయితే.. మరీనూ.
ఏడేళ్ల తర్వాత..2018లో వెస్టిండీస్ తో ఆడిన తర్వాత.. హైదరాబాద్ కు ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ అవకాశం దక్కింది. విశాఖలో అయితే.. చివరిసారిగా 2016 జూలైలో ఇదే ఇంగ్లండ్ తో మ్యాచ్ జరిగింది. మళ్లీ ఏడేళ్లకు వాల్తేరు వాసులకు టెస్టు మ్యాచ్ ను చూసే భాగ్యం కలిగింది. ఇక.. తాజా మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. 399 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ప్రత్యర్థిని 292 పరుగులకే ఆలౌట్ చేసింది. 106 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయం లో ప్రధాన పాత్ర పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాదే.
స్పిన్ పిచ్ లపై పేసర్ పంజా భారత్ అంటే స్పిన్ పిచ్ ల స్వర్గధామం. కానీ, విశాఖపట్నం, హైదరాబాద్ టెస్టుల్లో మాత్రం బుమ్రా ప్రతాపం చూపాడు. స్పిన్ పిచ్ లపైనా తనదైన శైలితో వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 6/45 & 3/46… ఇదీ విశాఖ టెస్టులో బుమ్రా ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్ లో అతడి యార్కర్ బంతికి ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ వికెట్లు చెల్లాచెదురయ్యాయి. చరిత్రలో నిలిచిపోయే యార్కర్ గా దీనిని ఇప్పటికీ చెబుతున్నారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ లోనూ బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. దీంతోనే.. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను కాదని మరీ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు.
హైదరాబాద్ లోనూ ముద్ర 2/28 & 4/41.. ఇవీ హైదరాబాద్ ఉప్పల్ లో బుమ్రా తీసిన వికెట్లు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా మరీ ప్రభావవంతంగా కనిపించాడు. అయితే, టీమిండియా కాస్త పట్టు విడవడంతో మ్యాచ్ చేజారింది. వాస్తవానికి భారత్ లో ఐదు టెస్టుల సిరీస్ అంటే ఏ స్పిన్నర్ ఎక్కువ వికెట్లు తీస్తాడనేది చర్చగా ఉండేది. అయితే, జడేజా గాయంతో తొలి టెస్టుకే పరిమితం అయ్యాడు. అశ్విన్ ఇదివరకటిలా చకచకా వికెట్లు తీయడం లేదు. కానీ, ఆ భారాన్ని ఓ పేసర్ అయినప్పటికీ బుమ్రానే మోస్తున్నాడు. రెండు టెస్టుల్లోనే అతడు 15 వికెట్లు పడగొట్టడం విశేషం. సరిగ్గా ఆరు నెలల కిందట గాయం నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టిన ఓ పేసర్ ఇంతటి గొప్ప ప్రదర్శన చేయడం ఆశ్చర్యమే. మరో మూడు టెస్టులు మిగిలిఉన్న నేపథ్యంలో బుమ్రా మొత్తం సిరీస్ లో 30కి పైగా వికెట్లు తీసినా ఆశ్చర్యం లేదు.