Begin typing your search above and press return to search.

అత్యధిక పరుగుల సచిన్ రికార్డుకు 'రూట్' వేసేస్తున్నాడు

16 వేల పరుగులతో అతడు ఎవరికీ అందనంత స్థాయిలు ఉంటాడని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 12:30 PM GMT
అత్యధిక పరుగుల సచిన్ రికార్డుకు రూట్ వేసేస్తున్నాడు
X

15,900 పరుగులు.. టెస్టుల్లో ఇప్పటివరకు మరెవరికీ సాధ్యం కాదని అనిపించిన రికార్డు ఇది.. కానీ.. దీనికి గట్టిగా రూట్ వేస్తున్నాడు ఓ బ్యాట్స్ మన్. చాపకింద స్కోరులా అతడు దూసుకుని వస్తున్నాడు. మరొక్క మూడేళ్లు గనుక ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మన సచిన్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. 16 వేల పరుగులతో అతడు ఎవరికీ అందనంత స్థాయిలు ఉంటాడని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో టాప్ 4 బ్యాట్స్ మెన్ అంటే.. విరాట్ కోహ్లి, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్. వీరిలో సచిన్ రికార్డుకు గురి పెట్టింది ఎవరు అంటే.. కొన్నాళ్ల కిందట వరకు అందరి పేర్లు చెప్పేవారు. ఇప్పుడు మాత్రం..ఒక్కడి పేరే చెబుతున్నారు. దీనికి కారణం అతడు కొనసాగిస్తున్న నిలకడ.

కోహ్లిని మించి..

ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జోరూట్ (12,274) ఇప్పుడు టెస్టుల్లో సచిన్ రికార్డుపై గురిపెట్టాడు. 12 వేల పరుగుల రికార్డును దాటేసిన అతడు మరో 200 పరుగులు కూడా కొట్టేశాడు. విరాట్ కోహ్లితో మొన్నటి వరకు పోటీ పడిన రూట్ ఇప్పుడు కోహ్లిని నెట్టేశాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో రూట్ 143 పరుగులు చేశాడు. మొదటి టెస్టులోనూ అతడు 100 కు పైగా పరుగులు (రెండు ఇన్నింగ్స్ లో) చేశాడు. రూట్ తాజా సెంచరీ 33వ టెస్టు సెంచరీ. దీంతో అతడు అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు.

బాదుడు కాలంలోనూ..

బజ్ బాల్ పేరిట ఐదేళ్లుగా ఇంగ్లండ్ టెస్టులను కూడా వన్డేల తరహాలో ఆడుతోంది. రోజుకు 500 పరుగులు చేయాలనే తీరు కనిపిస్తోంది. ఇలాంటి కాలంలోనూ రూట్ నిలకడ చూపుతున్నాడు. ఎందుకిలా చెప్పాల్సి వస్తున్నదంటే.. తొలి 117 టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన అతడు.. బజ్‌ బాల్‌ వచ్చాక 28 టెస్టుల్లోనే 8 సెంచరీలు బాదాడు. ఇక అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌ (64) రూట్ మాత్రమే. ఇక్కడా సచిన్‌ ను (68 ) అధిగమించడం ఖాయం.

50 సెంచరీలు చేస్తాడా?

33 ఏళ్ల రూట్ ప్రస్తుతం 33 శతకాలతో ఉన్నాడు. కనీసం మూడేళ్లు లేదా నాలుగేళ్లు.. ఇంకో 40 టెస్టులు ఆడతాడు. దీంతో సెంచరీలు ‘50’ దాటడం ఖాయమని అంటున్నారు. దీనిని చేరడం మరే బ్యాటర్ కూ సాధ్యం కాదు. కోహ్లి 29 సెంచరీల వద్దనే ఉన్నాడు. అయితే, ఓవరాల్ గా సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (664 మ్యాచ్ లలో 34,357 పరుగులు)ను రూట్ చేరలేదు. కోహ్లి (26,942)నే ఈ విషయంలో రూట్ కంటే ముందున్నాడు. రూట్ వన్డేలు కూడా తగ్గించాడు. అతడు మూడు ఫార్మాట్లలో 19,546 పరుగులే చేశాడు. ఇక 100 సెంచరీల సచిన్‌ రికార్డు కు చేరువగా ఉన్నది కోహ్లి (80)నే. కానీ, ఇంకా 20 సెంచరీలు అంటే మాటలు కాదు.