Begin typing your search above and press return to search.

4/10.. ఐపీఎల్ జట్ల కెప్టెన్లు మారుతున్నారోచ్.. కోహ్లి కూడా?

మొత్తం ఫ్రాంచైజీల్లో ఆరు మాత్రం తమ పాత కెప్టెన్లనే కొనసాగిస్తుండగా.. నాలుగు జట్టు సారథులను మారుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2024 11:15 AM GMT
4/10.. ఐపీఎల్ జట్ల కెప్టెన్లు మారుతున్నారోచ్.. కోహ్లి కూడా?
X

భారీగా నిబంధనల్లో మార్పులు.. మెగా వేలం.. ఇలా అనేక కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే సీజన్ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. అయితే, వీటికి మించి మరో అదిరిపోయే అప్ డేట్ ఏమంటే అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఫ్రాంచైజీలు మారుతుండడం. వీరిలో కొందరు టైటిళ్లు గెలిపించినవారైతే మరికొందరు తమ జట్లను ఫెయిల్యూర్స్ నుంచి బయటపడేసినవారు అని చెప్పాలి. మొత్తం ఫ్రాంచైజీల్లో ఆరు మాత్రం తమ పాత కెప్టెన్లనే కొనసాగిస్తుండగా.. నాలుగు జట్టు సారథులను మారుస్తున్నాయి.

జట్ల వెనుక ఉన్నది వీరే..

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదు టెటిళ్లు గెలవడం వెనుక ఉన్నది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కెప్టెన్ రోహిత్ శర్మలు అనే సంగతి అందరికీ తెలిసిందే. జట్టు గెలుపులో ఒక కెప్టెన్ పాత్ర ఏమిటో వీరు నిరూపించారు. జట్టుకు కెప్టెన్ ఎంత ముఖ్యం అనేది దీని ద్వారా తెలుస్తోంది. గత సీజన్ లోనూ కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపులో టీమ్ ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ది విడదీయలేని పాత్ర.

అయ్యర్ ను వదులుకుని..

కోల్ కతా నైట్ రైటర్స్ ను పదేళ్ల తర్వాత విజేతగా నిలిపిన అయ్యర్ ను ఆ ఫ్రాంచైజీ వదులుకుంటుందట. దీనికి కారణం.. అయ్యర్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడమేనని సమాచారం. అయితే, అయ్యర్ స్థానంలో ఎవరిని కెప్టెన్ చేస్తుందో చూడాలి. బహుశా వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ కు పగ్గాలు అప్పగించవచ్చు.

పంత్ ను పక్కనపెట్టి..

అత్యంత ఆశ్చర్యకరం ఏమంటే ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్ ను పక్కనపెట్టడం. దీనికి కారణం ఏమిటో గానీ.. ఫ్రాంచైజీనే చెప్పాలి. ఘోర కారు ప్రమాదంతో 2023లో సీజన్ కు దూరమైనా గత సీజన్ లో తిరిగొచ్చాడు పంత్. బ్యాటింగ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ సీజన్ కు పంత్ ను వదిలేస్తుందట. దీంతో పంత్ ను చెన్నై లాక్కెళ్లిపోనుందట.

లక్నోకు చిక్కుముడి..

మూడు సీజన్లలో రెండు సార్లు లక్నో సూపర్ జెయింట్స్ ను ప్లే ఆఫ్స్ చేర్చాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. కానీ, గత సీజన్ లో హైదరాబాద్ తో మ్యాచ్ సందర్భంగా ఫ్రాంచైజీ ఓనర్ గోయెంకాతో అతడికి వాగ్వాదం జరిగింది. దీంతో వచ్చే సీజన్ కు రాహుల్ లక్నోకు కొనసాగడం కష్టమేనని భావించారు. ఇప్పుడు అదే జరగనుంది. రాహుల్ ను మరిప్పుడు ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందో చూడాలి. లక్నో మాత్రం తమ కెప్టెన్ గా వెస్టిండీస్ బ్యాటర్ నికొలస్ పూరన్ ను నియమించనుందట.

బెంగళూరుకు మళ్లీ భాగ్యం

2013 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్సీ చేసిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడేళ్ల కిందట దానిని వదిలేశాడు. అప్పట్లోనే టీమ్ ఇండియా పగ్గాలూ వదులుకున్నాడు. అలాంటి కోహ్లి ఈసారి మళ్లీ బెంగళూరు కెప్టెన్ కానున్నాడట. అదే జరిగితే పెద్ద విశేషమే.

మొత్తంమీద 10 ఐపీఎల్ జట్లలో నాలుగింటికి కెప్టెన్లు మారుతున్నారు. ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్ కు సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్, సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్యాట్ కమ్మిన్స్, గుజరాత్ టైటాన్స్ కు శుభ్ మన్ గిల్, పంజాబ్ కింగ్స్ కు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా కొనసాగనున్నారు. వీరిలో ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. బహుశా ఐపీఎల్ లోనూ పంజాబ్ అతడిని అట్టిపెట్టుకుంటుందో లేదో చూడాలి. అలాగైతే ఐదో జట్టుకూ కెప్టెన్ మారతాడు.