భారత్ కు పిచ్ అనుకూలతపై పిచ్చి మాటలు..ఇదేంది శాంట్నర్?
వాస్తవానికి దుబాయ్ పిచ్ లు నెమ్మదిగా ఉన్నాయి. పైగా టీమ్ ఇండియాకు కూడా సొంత పిచ్ లేం కావు.
By: Tupaki Desk | 7 March 2025 9:00 PM IST'మ్యాచ్ లన్నీ దుబాయ్ లో ఆడడం భారత్ కు అనుకూలం..' చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలివి... ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ కూడా ఇదే విధంగా మాట్లాడినట్లు కథనాలు వచ్చినా, చివరకు అతడు ఖండించాడు. వాస్తవానికి దుబాయ్ పిచ్ లు నెమ్మదిగా ఉన్నాయి. పైగా టీమ్ ఇండియాకు కూడా సొంత పిచ్ లేం కావు. చాలా రోజుల తర్వాత అదీ వన్డే ఫార్మాట్లో ఇక్కడ ఆడుతోంది రోహిత్ శర్మ టీమ్. అయినా, ఇంగ్లండ్ మాజీలకు మాత్రం కుళ్లుగా మారింది. విమర్శించడానికి ఏ అవకాశమూ లేక ఈ పాయింట్ ను లేవెనెత్తారు. దీనికి భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా దీటుగానే సమాధానం చెప్పాడు.
ఒకవేళ భారత జట్టు పాకిస్ధాన్ వెళ్లి లాహోర్, రావల్పిండిలో మ్యాచ్ లు ఆడింది అనుకుందాం..? అక్కడ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు 350 పైగా పరుగులు చేశాయి. వాటి కంటే మెరుగైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు 400 పరుగులు చేస్తుంది కదా.?? ఈ లెక్కన దుబాయ్ లో ఆడడం భారత్ కే మైనస్ అనుకోవాలి.
ఇవేమీ పట్టించుకోకుండా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా భారత్ కు మైదానంలో పిచ్ తెలిసి ఉండటం కలిసొచ్చే అంశమని అంటున్నాడు. అయితే, తాము తీవ్రంగా ప్రయత్నిస్తామని తెలిపాడు. మ్యాచ్ లో ఏం చేయాలో పిచ్ కొద్దిగా నిర్ణయిస్తుందని.. పిచ్ పరిస్థితి భారత్ కు బాగా తెలుసు అని వ్యాఖ్యానించాడు. లాహోర్ తో పోలిస్తే దుబాయ్ లో బంతి మరింత నెమ్మదిగా కదులుతోందని.. దీన్ని కూడా తాము విస్మరించమని శాంట్నర్ అన్నాడు.
వాస్తవానికి ఈ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో రెండోసారి తలపడుతోంది కివీస్. దుబాయ్ లో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మరింత మెరుగ్గా వచ్చామని శాంట్నర్ అంటున్నాడు. టోర్నీల సందర్భంగా మ్యాచ్ ల కోసం వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం సాధారణమేనని పేర్కొన్నాడు.
5 వికెట్ల వీరుడు డౌటే?
చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో భారత్ పై ఐదు వికెట్లు పడగొట్టిన పేసర్ మాట్ హెన్రీ ఫైనల్ ఆడడం అనుమానమే. దక్షిణాఫ్రికాతో సెమీ ఫైనల్లో క్లాసెన్ క్యాచ్ అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది.