Begin typing your search above and press return to search.

బీసీసీఐ మాటకు ఐసీసీ తలొంచాల్సిందే..చాంపియన్స్ ట్రోఫీ జట్టు వాయిదా

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ బాస్.

By:  Tupaki Desk   |   11 Jan 2025 10:30 AM GMT
బీసీసీఐ మాటకు ఐసీసీ తలొంచాల్సిందే..చాంపియన్స్ ట్రోఫీ జట్టు వాయిదా
X

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ బాస్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. మన దేశంలో క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ. కానీ, బీసీసీఐ ఏం చెబితే దానికి ఐసీసీ తలొంచాల్సిందే.. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన విషయంలోనూ ఇది మరోసారి నిరూపితం అయింది.

చాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి పాకిస్థాన్ లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి 12వ తేదీ నాటికి (ఆదివారం) 15వ మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించాల్సి ఉంది. మరొక్క రోజే గడువు ఉండడంతో దాదాపు అన్ని జట్లూ ఇందుకు సిద్ధం అయ్యాయి. కానీ, భారత్ మాత్రం కాదు.

టీమ్ ఇండియా ఎంపికపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు లేరు. ఇంగ్లండ్‌ తో వన్డే, టి20 సిరీస్‌ లకు, చాంపియన్స్ ట్రోఫీ కి జట్లను ఎంపిక చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని చీఫ్ సెలక్షన్ కమిటీ మొదట భావించింది. అయితే, ఇంగ్లండ్‌ తో టి20 సిరీస్‌ కు మాత్రమే శనివారం లేదా ఆదివారం జట్టును ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.

చాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ టోర్నీ. దీని ప్రారంభానికి కనీసం నెల ముందే జట్లను ప్రకటించాలి. ఈసారి 5 వారాల ముందే ప్రాబబుల్స్ ను ప్రకటించి మార్చుకునే అవకాశం కల్పించారు. కానీ, బీసీసీఐ మాత్రం నెల ముందు మాత్రమే తుది జట్టును ప్రకటిస్తామని ఐసీసీకి చెప్పింది. దీంతో ఈ నెల 19న చాంపియన్స్‌ ట్రోఫీ జట్టును ప్రకటిస్తారని భావిస్తున్నారు.

ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్ లో జరగనుంది. దీనికిముందు ఇంగ్లండ్ తో టీమ్ ఇండియా ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడనుంది. ఈ సిరీస్‌ కు ఎంపికయ్యే జట్టే చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడనుంది. మేటి పేసర్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ వంటి వారికి విశ్రాంతి ఇవ్వడం, షమీ ఫిట్‌నెస్‌ ను పరీక్షించడమే దీనికి కారణం.

ఐసీసీ ప్రపంచంలో మరే దేశం కోరినా ఒప్పుకోదేమో గానీ.. భారత్ కోరితే మాత్రం తలొంచాల్సిందే. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు ఉంది మరి. ప్రపంచలోనే ధనిక క్రికెట్ బోర్డు ఉన్న భారత్ తో సిరీస్ అంటేనే ఇప్పుడు కాసుల వర్షం. ఓ పదిపదిహేను దేశాల బోర్డులను పోషించగల సత్తా మన సొంతం. దీంతో ఐసీసీ కొమ్ములు మన చేతిలో ఉన్నట్లు.

కొసమెరుపు: ఐసీసీ చైర్మన్ జై షా.