Begin typing your search above and press return to search.

‘చాంపియన్’ ఆటగాళ్లకు గాయాలు..ట్రోఫీలో పెద్ద జట్లకు గట్టి దెబ్బనే?

ఆడేది ఎనిమిది జట్లు.. వన్డే ఫార్మాట్ కాబట్టి బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ సాధారణమైనవే అనుకున్నా.. మిగతా ఆరు ప్రధానమైన జట్లే.. కానీ, వాటిని గాయాల బెడద వేధిస్తింది..

By:  Tupaki Desk   |   12 Feb 2025 8:30 AM GMT
‘చాంపియన్’ ఆటగాళ్లకు గాయాలు..ట్రోఫీలో పెద్ద జట్లకు గట్టి దెబ్బనే?
X

ఆడేది ఎనిమిది జట్లు.. వన్డే ఫార్మాట్ కాబట్టి బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ సాధారణమైనవే అనుకున్నా.. మిగతా ఆరు ప్రధానమైన జట్లే.. కానీ, వాటిని గాయాల బెడద వేధిస్తింది.. వీరు కొత్తగా వచ్చిన కుర్రాళ్లో, మోస్తరు ఆటగాళ్లో అయితే ఫర్వాలేదు. కానీ, వీరు మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల ‘చాంపియన్ ఆటగాళ్లే’. ఒకటో రెండో మ్యాచ్ లకు కాదు.. మొత్తం టోర్నీకే దూరమయ్యారు. తమ తమ జట్లను ఇరకాటంలో పెట్టారు.

2017 నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్ట్ అయిన టీమ్ ఇండియాకు అందరికంటే ఎక్కువ ‘గాయమైంది’. స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో గాయపడిన బుమ్రా తిరిగి మైదానంలోకి దిగలేదు. అతడిని ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న వెన్ను గాయంపై నెల రోజుల నుంచి అప్‌ డేట్ లేదు. అయితే, బుమ్రా స్థాయి రీత్యా అప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌ లో చోటిచ్చారు. మంగళవారం మార్పుచేర్పులకు ఆఖరి రోజు కావడంతో బుమ్రా లేకుండానే జట్టును ప్రకటించేశారు.

కెప్టెన్ తో పాటు నలుగురు..

ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అయితే, గాయం కారణంగా అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బ్యాట్స్ మన్ స్టీవ్‌ స్మిత్‌ కు కెప్టెన్సీ ఇచ్చారు. మంచి ఆల్‌ రౌండర్లైన మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినిస్‌ లూ అందుబాటులో లేకుండా పోయారు. నిన్నటివరకు స్టార్‌ పేసర్ జోష్‌ హేజిల్‌ వుడ్ గాయంతో దూరమైనట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మేటి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తోడయ్యాడు. వీరంతా వన్డే ప్రపంచ కప్‌ నెగ్గిన జట్టులో సభ్యులు.

రెక్కలు విరిగిన కివీ

న్యూజిలాండ్ జట్టులో ఇటీవల ప్రధాన ఆటగాడిగా మారిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర లాహోర్ లోని గడాఫీ మైదానంలో బంతి నుదుటికి బలంగా తాకడంతో మైదానాన్ని వీడాడు. వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడిన రచిన్.. చాంపియన్స్ ట్రోఫీకి కష్టమే అంటున్నారు. కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్‌ కండరాలు పట్టేయడంతో ముక్కోణపు టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడలేదు. అతడూ చాంపియన్స్‌ ట్రోఫీకి అనుమానమేననే వార్తలు వస్తున్నాయి.

చాంపియన్స్ ట్రోఫీని అనేక అడ్డంకుల మధ్య నిర్వహిస్తున్న పాకిస్థాన్‌ అందరికంటే ఆలస్యంగా జనవరి నెలాఖరున జట్టును ప్రకటించింది. ఇటీవలి కాలంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ కంటే అద్భుతంగా రాణిస్తున్న యువ బ్యాట్స్ మన్ సయీం ఆయుబ్ కోసమే ఇలా చేసింది. చీలమండ గాయంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఆడిన 9 వన్డేల్లో మూడు సెంచరీలు చేసిన ఆయుబ్ ను ఎలాగైనా జట్టులోకి తీసుకోవాలని పాకిస్థాన్ చూసింది. కానీ, అతడు కోలుకోకపోవడం వీలుకాలేదు.

దక్షిణాఫ్రికా సూపర్ పేసర్ ఆన్రిచ్‌ నోకియా. ఒక టోర్నీలో ఆడితే మరో సిరీస్ కు దూరమయ్యే నిత్య గాయకుడు ఇతడు. తాజాగా వెన్ను నొప్పితో చాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు.

భవిష్యత్ లో బెన్ స్టోక్స్ స్థాయి ఆల్ రౌండర్ గా భావిస్తున్న ఇంగ్లండ్ కుర్రాడు జాకబ్‌ బెతెల్ భారత పర్యటనలో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, తొడ కండరాల నొప్పితో తదుపరి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇతడూ చాంపియన్స్ ట్రోఫీ ఆడడం కష్టమే.