ట్రోఫీ కోసం క్రికెటర్స్ 'ధూమ్-2' విన్యాశాలు... ఐసీసీ వీడియో వైరల్!
క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా చూస్తున్న మరో ఐసీసీ సిరీస్ 'ఛాంపియన్స్ ట్రోఫీ - 2025'.. ఫిబ్రవరి 19 నుంచి మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 22 Jan 2025 3:32 PM GMTక్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా చూస్తున్న మరో ఐసీసీ సిరీస్ 'ఛాంపియన్స్ ట్రోఫీ - 2025'.. ఫిబ్రవరి 19 నుంచి మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీకి సంబంధించి టీమిండియా ఆడే మ్యాచ్ లు మినహా మిగిలినవన్నీ పాకిస్థాన్ లో జరగబోతున్నాయి. వీటికి కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికలు కానున్నాయి. భారత్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి.
ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్ ల షెడ్యూల్ తెరపైకి రావడంతో.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 23న జరగనున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ప్రోమో విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అవును... ఐసీసీ, ఛాంపియన్స్ ట్రోఫీ పై ప్రోమో విడుదల చేసింది. ఈ వీడియోలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు పాక్ స్పీడ్ స్టర్ షాహిన్ షా అఫ్రీది, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్, ఆఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ కనిపించారు. వీరంతా ట్రోఫీ కోసం.. 'ధూమ్ - 2' సినిమాలో డైమండ్ కోసం లేజర్ కిరణాలను దాటుకుంటూ హృతికి రోషన్ చేసిన విన్యాశాలన్నీ చేస్తూ కనిపించడం గమనార్హం.
అంటే... ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు ఎంతో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటారని.. ఇదే సమయంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటారని.. రేసులో ఉండటానికి తమను తాము అద్భుతంగా మౌల్డ్ చేసుకుంటారని.. ఈ ట్రోఫీ అంత ఈజీగా దక్కదని చెప్పే ప్రయత్నంలో భాగంగా.. ఈ ప్రోమోని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతుంది.