Begin typing your search above and press return to search.

చాంపియన్స్ ట్రోఫీ సెమీస్.. ఇటు భారత్, న్యూజిలాండ్.. మరి అటు ఎవరు?

అంతా సజావుగా సాగితే క్రికెట్ లో మజా ఏం ఉంటుంది..? అందుకే వర్షం వచ్చింది.. రెండు పెద్ద జట్లయిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దయింది.

By:  Tupaki Desk   |   26 Feb 2025 7:11 PM GMT
చాంపియన్స్ ట్రోఫీ సెమీస్.. ఇటు భారత్, న్యూజిలాండ్.. మరి అటు ఎవరు?
X

అంతా సజావుగా సాగితే క్రికెట్ లో మజా ఏం ఉంటుంది..? అందుకే వర్షం వచ్చింది.. రెండు పెద్ద జట్లయిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఈ టోర్నీ గ్రూప్-ఎలో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఈ గ్రూప్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు రెండేసి మ్యాచ్ లు ఓడిపోయి టోర్నీ నుంచి ఔట్ అయ్యాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరుకున్నాయి. వచ్చే ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బిలోని రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. గ్రూప్ ఎ లో రెండోస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ బి టాపర్ తో ఆడుతుంది. మరి గ్రూప్ బి నుంచి సెమీస్ చేరే జట్లేవి?

గ్రూప్ ఎతో పోలిస్తే గ్రూప్ బి నే కాస్త టఫ్. ఎందుకంటే ఇందులో మూడు పెద్ద జట్లున్నాయి. అవి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్. ఇక వీటిలో రావల్పిండిలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దయింది. దీంతో చెరో పాయింట్‌ కేటాయించారు. ఇంగ్లండ్ పై బుధవారం సంచలన విజయం సాధించిన అఫ్ఘాన్ గ్రూప్‌ బి సెమీస్‌ సమీకరణాలు ఆసక్తికరంగా మార్చింది.

ఇప్పటికే అఫ్ఘాన్ పై గెలిచిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పై నెగ్గిన ఆస్ట్రేలియా మూడేసి పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన నెట్‌ రన్‌ రేట్‌ తో దక్షిణాఫ్రికా ప్రస్తుతానికి టాపర్ గా ఉంది.

మార్చి 1న ఇంగ్లాండ్‌ తో జరిగే మ్యాచ్ లో నెగ్గితే దక్షిణాఫ్రికా నేరుగా సెమీస్ కు వెళ్తుంది.

ఆస్ట్రేలియా శుక్రవారం అఫ్గాన్ తో ఆడనుంది. గెలిస్తే 5 పాయింట్లతో సెమీస్‌ చేరుతుంది.

ఆస్ట్రేలియా, అఫ్ఘాన్ పై ఓడిన ఇంగ్లాండ్ కు సెమీస్ చాన్స్ లేనట్లే. దక్షిణాఫ్రికాపై గెలిచినా ఆ జట్టు ఖాతాలో 2 పాయింట్లే ఉంటాయి.

అఫ్ఘాన్ పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా నెగ్గితే ఐదేసి పాయింట్లతో సెమీస్ కు వెళ్తాయి. రన్ రేట్ ప్రకారం టేబుల్ టాపర్ ను నిర్ణయిస్తారు.

అఫ్ఘాన్ గనుక ఆసీస్ ను ఓడిస్తే 4 పాయింట్లతో నేరుగా సెమీస్ కు వెళ్తుంది. అటు దక్షిణాఫ్రికా కూడా ఇంగ్లండ్ పై గెలిస్తే 5 పాయింట్లతో టేబుల్ టాపర్ అవుతుంది.

ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్ లో అఫ్ఘాన్ పై కచ్చితంగా గెలవాలి. లేకుంటే మూడు పాయింట్లతో ఉంటుంది. ఇంగ్లండ్ చేతిలో ఓడితే దక్షిణాఫ్రికాకూ మూడే పాయింట్లు ఉంటాయి. అప్పుడు రన్ రేట్ లో ఏది ముందుటే ఆ జట్టే సెమీస్ గడప తొక్కుతుంది.