సంచలనం.. పాక్ వెళ్లబోమన్న భారత్.. భారీ క్రికెట్ టోర్నీ క్యాన్సిల్
ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు భారత క్రికెట్ జట్టును పంపేది లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేల్చి చెప్పింది.
By: Tupaki Desk | 10 Nov 2024 7:35 AM GMTపరిమిత ఓవర్ల ప్రపంచ క్రికెట్ లో ప్రపంచ కప్ తర్వాత అత్యంత కీలకమైనది అది. ఇప్పటికే భారత్ పలుసార్లు గెలుచుకున్న టోరీఫీ ఇది. మరోవైపు వచ్చే ఏదాది ప్రారంభంలో టోర్నీ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో.. అదీ సొంతగడ్డపై ఓడిన భారత్.. ఈ టోర్నీని గెలిస్తే ప్రపంచ క్రికెట్ లో తన స్థాయిని చాటుతుంది. అయితే, వేదికను కారణంగా చూపుతూ తాము వెళ్లేది లేదని స్పష్టం చేసింది.
అక్కడ అడుగుపెట్టం
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది. అయితే, దాదాపు రెండేళ్లుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఈ ట్రోఫీకి భారత్ తమ జట్టును పంపుతుందా? లేదా? అనేది. అసలు గత ఏడాది పాకిస్థాన్ జట్టు భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనడం కూడా దీని కారణంగా సందిగ్ధంలో పడింది. తమ దేశానికి భారత్ రాకుంటే.. తాము భారత్ వెళ్లబోమని పాక్ భీష్మించింది. కానీ, చివరకు పాక్ పాల్గొనడం.. దారుణంగా పరాభవం చెందడం వేరే సంగతి. మళ్లీ ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు భారత క్రికెట్ జట్టును పంపేది లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేల్చి చెప్పింది.
కేంద్రం అనుమతి ఇవ్వదు..
భద్రతా కారణాల రీత్యా భారత జట్టును పాకిస్థాన్ కు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా అనుమతించడం లేదు. తాజాగా కూడా బీసీసీఐ ఇదే మాటను ఐసీసీకి చెప్పింది. ముంబైపై జరిగిన 26/11 దాడుల అనంతరం భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించలేదు. కానీ, వచ్చే ఫిబ్రవరి 19-మార్చి 9 మధ్య చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికి ఎలాగైనా భారత జట్టును రప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీబీసీ) ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే ఒక్క స్టేడియంలోనే మ్యాచ్ లు ఆడిస్తామని.. దుర్బేధ్యమైన భద్రత కల్పిస్తామని చెబుతోంది. కానీ, భారత్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇదే నిర్ణయాన్ని ఐసీసీకి చెప్పేసింది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లను యూఏఈలో లేదా మరో తటస్థ వేదికలో నిర్వహించేలా (హైబ్రిడ్) చూడడం తప్ప పీసీబీకి ప్రత్యామ్నాయం లేదు.
అసలు టోర్నీనే రద్దు..
పాకిస్థాన్ కు వెళ్లడం అటుంచి అసలు భారత్ పాల్గొనకపోతే టోర్నీకి వ్యూయర్ షిప్ ఉండదని భావించిందో ఏమో..? బీసీసీఐ ఏకంగా చాంపియన్స్ టోర్నీనే రద్దు చేసేయనుందట. అధికారికంగా ప్రకటన రాకున్నా.. ఇదే ఆలోచన చేస్తోందట. ట్రోఫీని నిర్వహిస్తామని పీసీబీ పట్టుదలగా ఉండడం, భారత్ గైర్హాజరుతో షెడ్యూలింగ్ ఇబ్బందులు వస్తుండడంతో ఇదే మంచి నిర్ణయమని భావిస్తున్నారట. టోర్నీ వంద రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. అలాంటిదేమీ లేకపోవడంతో రద్దు ఖాయమని చెబుతున్నారు.