రూ.16 కోట్ల మేటి ఆల్ రౌండర్ కు సీఎస్కే షాక్.. అదీ ధోనీ సేనంటే?
సీఎస్కే గత సీజన్ కు ముందు పేస్ బౌలింగ్ ప్రపంచ మేటి ఆల్ రౌండర్ ను రూ.16.25 కోట్లు పెట్టి కొనుక్కుంది
By: Tupaki Desk | 22 Aug 2023 9:49 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే..? ఆటగాళ్ల కంటే జట్టుగా రాణించే జట్టు ఏదంటే..? కెప్టెనే ఓ బలంగా ఉన్న జట్టు ఏదంటే..? అందరి నుంచి వచ్చే సమాధానం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). అలాంటి జట్టులో ఎలాంటి ఆటగాడు చేరినా కచ్చితంగా రాణిస్తాడు. కెప్టెన్ ధోనీ అందించే స్ఫూర్తిదాయక ప్రోత్సాహం.. ఆటగాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ అలాంటిది. ఒక దీపక్ చాహర్, ఒక అజింక్య రహానే, ఒక రవీంద్ర జడేజా, ఒక శివమ్ దూబె.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో పేర్లు. కెరీర్ లో వెనుకబడిన వీరంతా సీఎస్కే కు ఆడిన తర్వాత మళ్లీ పైకి లేచారు. ఇప్పుడు సీఎస్కే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కీలక విదేశీ ఆల్ రౌండర్ ను వచ్చే సీజన్ కు వదిలించుకోవాలని నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.
ఇతడు కాదు అతడు..
సీఎస్కే గత సీజన్ కు ముందు పేస్ బౌలింగ్ ప్రపంచ మేటి ఆల్ రౌండర్ ను రూ.16.25 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇది లీగ్ చరిత్రలో రికార్డు ధర. తమ దేశానికి వన్డే ప్రపంచ కప్ సాధించిపెట్టిన ఆ ఆల్ రౌండర్ ఇప్పటికీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. అంతేకాదు.. గతేడాది అనూహ్యంగా వన్డేలకు గుడ్ బై చెప్పిన అతడు టెస్టులు, టి20లు ఆడుతూ వస్తున్నాడు. అయితే, ప్రపంచ కప్ లో అతడి పాత్రమిటో తెలిసిన క్రికెట్ బోర్డు, కెప్టెన్.. ఆ ఆటగాడిని వన్డే రిటైర్మెంట్ వెనక్కు తీసుకునేలా చేశారు.
ఈ ప్రయత్నం ఫలించి ఆ మేటి ఆల్ రౌండర్ మళ్లీ వన్డేలు ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇంతలోనే అతడికి ఫ్రాంచైజీ జట్టు షాక్ ఇవ్వనుంది. వచ్చే సీజన్ కు అతడిని వదిలించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ఆల్ రౌండర్ స్థానంలో మరో మేటి జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడిని తీసుకోవాలని అనుకుంటోందట.
పైన చెప్పుకొన్నదంతా ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గురించి. గత సీజన్ లో సీఎస్కే కు రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడిన స్టోక్స్ గాయంతో వైదొలగాడు. అందులోనూ 15 పరుగులే చేశాడు. ఒక్క ఓవరే వేయగలిగాడు. రూ.16 కోట్ల ధరకు న్యాయం చేయలేకపోయాడు. కాగా, స్టోక్స్ కు వెన్ను గాయం సలుపుతూనే ఉంది. బ్యాట్స్ మన్ గానే ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచ కప్ లో ఆడనున్నాడు.
కెప్టెన్ గానే భారత్ కు
స్టోక్స్ వన్డే ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ గా భారత్ కు రానున్నాడు. ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టులు ఆడేందుకు భారత్ లో పర్యటించనుంది. దీనికి కెప్టెన్ స్టోక్సే. మార్చి వరకు జరిగే టెస్టు సిరీస్ అనంతరం ఐపీఎల్ మొదలు కానుంది. కాగా, విశ్రాంతి ఎరుగని క్రికెట్ కు తోడు ఫిట్ నెస్ కారణాలతో లీగ్ లో ఆడేందుకు స్టోక్స్ సుముఖంగా లేడని కూడా తెలుస్తోంది. వీటన్నిటి మధ్య స్టోక్స్ ను అట్టిపెట్టుకోవడం కంటే వదులుకోవడమే ఉత్తమమని సీఎస్కే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అతడి స్థానంలో ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్, మేటి పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ను తీసుకునే అవకాశం ఉందట. 2020లో కమ్మిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది మినీ వేలంలో వదులుకుంది. ఇంతలోనే కమ్మిన్స్ లీగ్ లో పాల్గొనలేనని తప్పుకొన్నాడు. కాగా, లోయరార్డర్ లో బ్యాట్ తో ఓ చేయి వేసే కమ్మిన్స్ ను ఈసారి సీఎస్కే కొనుగోలు చేసేందుకు గట్టిగా ప్రయత్నాలు సాగించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే చెన్నై బలం మరింత పెరుగుతుంది. స్పిన్ లో జడేజా, మోయిన్ అలీ ఉన్నప్పటికీ పేస్ లో చెన్నై కొంత బలహీనంగా ఉంది. దీపక్ చాహర్ వంటి వారి మీదనే అధికంగా ఆధారపడుతోంది. కమ్మిన్స్ రాకతో ఈ లోటు తీరనుంది.