Begin typing your search above and press return to search.

జడేజా మాయాజాలం... కోల్ కతా విజయాలకు చెన్నై బ్రేక్!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 22వ మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది

By:  Tupaki Desk   |   9 April 2024 4:03 AM GMT
జడేజా మాయాజాలం... కోల్ కతా విజయాలకు చెన్నై బ్రేక్!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 22వ మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ముందు నుంచీ అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ లలో ఒకటిగా భావించిన ఈ పోరు.. అంతకు మించిన ఆసక్తిగా సాగింది. ఈ సమయంలో ఆధ్యాంతం ఈ మ్యాచ్ ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

తొలి బంతికే వికెట్!:

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై.. కోల్ కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో... ఫిలిప్‌ సాల్ట్, సునీల్ నరైన్ లు బ్యాటింగ్ కు దిగారు. ఈ సమయంలో తుషార్‌ దేశ్‌ పాండే వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఫిలిప్‌ సాల్ట్ (0) ఔటయ్యాడు. తర్వాతి ఐదు బంతుల్లో ఒకే సింగిల్ వచ్చింది.

అనంతరం ముస్తాఫిజుర్‌ వేసిన రెండో ఓవర్‌ లో ఒక బౌండరీ సాయంతో 6 పరుగులు రాగా.. తుషార్ దేశ్‌ పాండే వేసిన మూడో ఓవర్‌ లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో 19 పరుగులు వచ్చాయి. ఇదే క్రమంలో... శార్దూల్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్‌ లో 11 పరుగులు రాగా.. మహీశ్ తీక్షణ్ వేసిన ఐదో ఓవర్‌ లో 13 పరుగులు వచ్చాయి. దీంతో 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి కోల్ కతా స్కోరు 50కి చేరింది.

పవర్ ప్లే ముగిసేనాటికి పరిస్థితి ఇది!:

ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే వికెట్ కోల్పోయినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో... ముస్తాఫిజుర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ లో ఆరుపరుగులు వచ్చాయి. దీంతో... పవర్ ప్లే ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది కోల్ కతా.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు!:

ఒకే ఓవర్‌ లో ఇద్దరు సెటిల్ బ్యాటర్లను ఔట్ చేశాడు జడేజా. అతడు వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో తొలి బంతికి రఘువంశీ (24: 18 బంతుల్లో) ఔట్ చేసిన జడేజా.. ఐదో బంతికి సునీల్ నరైన్ (27)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 7 ఓవర్లు పూర్తయ్యే సరికి 3 వికెట్లు కోల్పోయిన కోల్ కతా 61 పరుగులు చేసింది.

నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్!

తన తొలి ఓవర్ లో రెండు వికెట్లు తీసిన జడేజా.. ఇన్నింగ్స్ 8.2 ఓవర్‌ లో వెంకటేశ్ అయ్యర్ (3)ని ఔట్ చేసి మ్యాచ్‌ లో మూడో వికెట్‌ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 66 పరుగులకు చేరుకుంది.

కోల్ కతా ఐదో వికెట్ డౌన్!:

తీక్షణ వేసిన 12 ఓవర్‌ లో నాలుగో బంతికి రమణ్‌ దీప్‌ సింగ్ (13) సిక్స్ బాదాడు. తర్వాతి బంతికే క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌ కతా 85 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

100 దాటిన కోల్‌ కతా స్కోరు!:

శార్దూల్ ఠాకూర్‌ వేసిన 16 ఓవర్‌ లో ఐదో బంతికి శ్రేయస్ అయ్యర్ (26) బౌండరీ బాదాడు. దీంతో... ఈ ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. ఫలితంగా కోల్ కతా స్కోరు 16 ఓవర్లు పూరయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 109 పరుగులకు చేరింది.

ఆరో వికెట్ డౌన్!:

తుషార్ దేశ్‌ పాండే వేసిన 17 ఓవర్‌ లో నాలుగో బంతికి హార్డ్ హిట్టర్ రింకు సింగ్ (9) ఔటయ్యాడు. దీంతో కోల్ కతా స్కోరు 17 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 113.

చెలరేగిన చెన్నై బౌలర్లు.. కోల్ కతా నిర్దేశించిన లక్ష్యం 138!

తుషార్‌ దేశ్‌ పాండే వేసిన 18.2 ఓవర్‌ లో ఆండ్రూ రస్సెల్ (10).. ముస్తాఫిజుర్ వేసిన 19.1 ఓవర్ లో శ్రేయస్ అయ్యర్ (34) ఔటయ్యారు. దీంతో కోల్‌ కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది.

చెన్నై బౌలర్లలో జడేజా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తుషార్‌ దేశ్‌ పాండే 3, ముస్తాఫిజుర్ 2, తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై!:

కోల్ కతా నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా... చెన్నై ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌ లు బ్యాటింగ్ కు దిగారు. ఈ సమయంలో... మిచెల్‌ స్టార్క్‌ వేసిన తొలి ఓవర్ లో 4 పరుగులు వచ్చాయి. అనంతరం వైభవ్‌ వేసిన రెండో ఓవర్ లో 7 పరుగులు, స్టార్క్‌ వేసిన మూడో ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి!

చెన్నై ఫస్ట్ వికెట్ డౌన్!:

వైభవ్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతికి రచిన్‌ (15) ఔటయ్యాడు. ఇక ఈ ఓవర్ లో 3 పరుగులే రావడంతో చెన్నై స్కోరు 4 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు!

పవర్ ప్లే ముగిసే నాటికి పరిస్థితి ఇది!:

రుతురాజ్‌ గైక్వాడ్ (32) దూకుడు మీద ఉన్నాడు. మరోవైపు వైభవ్ వేసిన ఆరో ఓవర్‌ లో మూడో బంతికి మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ ను రమణ్‌ దీప్‌ మిస్‌ చేశాడు. ఈ సమయంలో పవర్ ప్లే ముగిసే నాటికి చెన్నై స్కోరు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.

10 ఓవర్లకు చెన్నై పరిస్థితి ఇది!:

కోల్ కతా నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై నిలకడగా ఆడుతోంది. ఇందులో భాగంగా 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 81 పరుగులు చేసింది. ఈ సమయంలో క్రీజ్ లో డారిల్ మిచెల్ (21), రుతురాజ్‌ గైక్వాడ్ (41) పరుగులతో ఉన్నారు.

రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ!:

వరుణ్‌ చక్రవర్తి వేసిన 12 ఓవర్‌ లో ఏడు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ (51) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 12 ఓవర్లలో చెన్నై ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.

చెన్నై రెండో వికెట్ డౌన్!:

సునీల్ నరైన్‌ వేసిన 12.3 ఓవర్‌ లో డారిల్ మిచెల్ (25) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 13 ఓవర్లకు చెన్నై స్కోరు 2 వికెట్ల నష్టానికి 99.

30 బంతుల్లో 23 పరుగులు!:

సునీల్ నరైన్ వేసిన 15 ఓవర్‌ లో ఆరు పరుగులు రావడంతో.. చెన్నై స్కోరు 115కి చేరింది. అప్పటికి క్రీజ్ లో రుతురాజ్‌ (60), శివమ్‌ దూబె (10) ఉన్నారు. అంటే... చెన్నై విజయానికి 30 బంతుల్లో 23 పరుగులు అవసరం అన్నమాట!

శివమ్‌ దూబె ఔట్.. క్రీజులోకి ధోనీ!:

చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. వైభవ్ వేసిన 17 ఓవర్‌ లో ఐదో బంతికి శివమ్ దూబె (28) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై స్కోరు 17 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు కాగా... రుతురాజ్‌ (62), ధోనీ (0) క్రీజులో ఉన్నారు.

చెన్నై సూపర్ విక్టరీ!:

చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌ లో ఏడు వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్ధేశించిన లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67*) అర్ధ శతకంతో మెరిశాడు.