'కంకషన్'లో భారత్ పక్షపాతం.. ఇంగ్లిష్ రిఫరీ బలుపు వ్యాఖ్యలు
పాత తరం ఇంగ్లిష్ వారిలో మాత్రం 'చిన్నచూపు' పోలేదు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టి20ల సిరీస్ లో కంకషన్ వివాదమే దీనికి నిదర్శనం.
By: Tupaki Desk | 3 Feb 2025 10:44 AM GMTఇంగ్లిష్ మీడియానే కాదు.. ఇంగ్లిష్ క్రికెటర్లూ ఒకప్పుడు భారత్ లేదా ఆసియా దేశాలంటే చిన్నచూపు చూసేవారు. వారి జట్టు గెలిస్తే తమ ప్రతిభ అనేవారు.. ఓడిపోతే అవతలి జట్టుకు పరిస్థితులు అనుకూలించాయని వ్యాఖ్యానించేవారు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ తీరు తగ్గింది. పాత తరం ఇంగ్లిష్ వారిలో మాత్రం 'చిన్నచూపు' పోలేదు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టి20ల సిరీస్ లో కంకషన్ వివాదమే దీనికి నిదర్శనం.
ఇంగ్లండ్ తో ఐదు టి20ల సిరీస్ ముగిసినా.. నాలుగో మ్యాచ్ సందర్భంగా తలెత్తిన 'కంకషన్' గొడమ మాత్రం ముగియలేదు. పుణెలో గత శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబె హెల్మెట్ కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి తగిలిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. ఫీల్డింగ్ కు మాత్రం రాలేదు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన హర్షిత్ రాణాను కంకషన్ సబ్ స్టిట్యూట్ గా ఆడించారు. దీనిపైనే దుమారం రేగుతోంది.
మీడియం పేస్ వేయగల బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన శివమ్ దూబె స్థానంలో పేస్ బౌలింగ్ వేసే ఆల్ రౌండర్ అయిన హర్షిత్ ను ఆడించేందుకు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అంగీకరించడంపై విమర్శలు వచ్చాయి. శ్రీనాథ్ టీమ్ ఇండియా మాజీ పేసర్ అనే సంగతి తెలిసిందే. దీంతో ఇదే అదనుగా ఇంగ్లండ్ మాజీలు విమర్శలకు దిగుతున్నారు. మాజీ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ఏకంగా శ్రీనాథ్ తన పొరపాటును ఒప్పుకోవాలని పోస్టు పెట్టాడు.
బ్రాడ్.. బ్యాడ్ కామెంట్..
రిఫరీ శ్రీనాథ్ నిర్ణయంపట్ల ఇంగ్లండ్ కే చెందిన సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా ఐసీసీపైనే విరుచుకుపడ్డాడు. ‘‘పక్షపాతం - అవినీతిమయమైన పాత రోజులకు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ'' వ్యాఖ్యానించాడు. ''స్వతంత్రంగా వ్యవహరించే అధికారులనే రిఫరీలుగా నియమించాలంటూ’’ పరోక్షంగా శ్రీనాథ్ ను టార్గెట్ చేశాడు. మ్యాచ్ ఆడే దేశాలకు చెందనివారినే రిఫరీలుగా నియమించాలని సూచించాడు.
భారత్ కు అవసరమా..?
వాస్తవంగా చెప్పాలంటే శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణాను ఆడించడం తప్పే. ‘లైక్ ఫర్ లైక్’ నిబంధన ప్రకారం దూబె లాంటి ఆటగాడినే మైదానంలోకి దించాలి. హర్షిత్ పూర్తిస్థాయి పేసర్. బ్యాటింగ్ అరకొరనే. మ్యాచ్ లో దూబె చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేశాడు. రెండు బంతులు ఉన్నాయనగా బంతి హెల్మెట్‌ను తాకింది. అప్పటికి కంకషన్ కాలేదు. కాబట్టి తర్వాత కంకషన్ సబ్ స్టిట్యూట్ ను అనుమతించడం సరికాదని అంటున్నారు భారత దిగ్గజం సునీల్ గావస్కర్. ఒకవేళ కంకషన్ సబ్ స్టిట్యూట్ ను తీసుకున్నా ఫీల్డింగ్ కే పరిమితం చేయాల్సిందన్నాడు. దూబె స్థానంలో రాణా సరైన భర్తీ కాదని.. ఒకటే ఎత్తు ఉన్నంతమాత్రన సరిపోదని పేర్కొన్నాడు. అందుకే ఇంగ్లండ్ ఫీల్ కావడంలో తప్పు లేదన్నాడు. అయినా.. భారత్ వంటి అద్భుతమైన జట్టు ఇలాంటివాటితో గెలవాల్సిన అవసరం ఏముందని గావస్కర్ చివరగా సమర్థించాడు.