మహిళా టెన్నిస్ లో కొత్త గ్రాఫ్.. కొకొ గాఫ్
మార్టినా నవ్రతిలోవా.. స్టెఫీ గ్రాఫ్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్.. వీరంతా మహిళా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన అమెరికన్లు.
By: Tupaki Desk | 10 Sep 2023 7:11 AM GMTమార్టినా నవ్రతిలోవా.. స్టెఫీ గ్రాఫ్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్.. వీరంతా మహిళా టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన అమెరికన్లు. విలియమ్స్ సోదరీమణులదైతే దశాబ్దం పాటు ఏకఛత్రాధిపత్యం. మార్టినా, స్టెఫీ వేర్వేరు దేశాల్లో పుట్టినా అమెరికాను కర్మ క్షేత్రంగా ఎంచుకున్నారు. అయితే, వీరంతా తప్పుకొన్నాక అమెరికన్ మహిళా టెన్నిస్ కళ తప్పింది. సెరెనాతోనే ఆ శకాంతం అయిందా? మరి వారిలానే మరొకరు వస్తారా..? అమెరికన్ టెన్నిస్ ను మళ్లీ టాప్ లో నిలుపుతారా? అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఆ నిరీక్షణకు తెరదించేలా వచ్చిందో టీనేజీ కెరటం.
అమెరికన్ టెన్నిస్ అంటే.. పవర్ ప్లస్ క్లాస్. అలాంటి ఆటను మళ్లీ చూడలేమనే బాధలో అభిమానులుండగా.. దానికి సమాధానంగా కనిపిస్తోంది కొకొ గాఫ్. యూఎస్ ఓపెన్ టైటిల్ కొట్టి సంచలనం రేపింది కొకొ గాఫ్. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో బెలారస్ కు చెందిన రెండో సీడ్ అరీనా సబలెంకను ఓడించిన గాఫ్ 19 ఏళ్లకే యూఎస్ ఓపెన్ టైటిల్ అందుకుని చరిత్ర పుటల్లోకి ఎక్కింది. యూఎస్ ఓపెన్ నెగ్గడం ఆమెకిదే తొలిసారి.
సెట్ ఓడినా.. స్థైర్యం సడలకుండా..
యూఎస్ ఓపెన్ ఫైనల్ లో బెలారస్ భామ సబలెంకానే అందరి ఫేవరెట్. సెమీఫైనల్లో ఆమె జోరు చూశాక టైటిల్ కొట్టేస్తుందని అందరూ భావించారు. దీనికితగ్గట్లే ఫైనల్లో తొలి సెట్ 6-2తో గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత కథ మారింది. కొకొ విరుచుకుపడింది. తర్వాతి రెండు సెట్లను 6-3, 6-2 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ మొత్తం 2 గంటల 6 నిమిషాలపాటు జరిగింది. యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవడం ద్వారా గాఫ్ కెరీర్ గ్రాఫ్ మారడం ఖాయం. ఇక యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన గాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది. సెరెనా విలిమమ్స్ తర్వాత ఈ ట్రోఫీని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
తను పుట్టకముందటి రికార్డును బద్దలుకొట్టి
ప్రత్యర్థి తనకంటే మెరుగైన క్రీడాకారిణి అయినా.. తొలి సెట్ ఓడినా.. ఆమెదే ఆధిపత్యం అనేలా కనిపించినా.. గాఫ్ ఆత్మవిశ్వాసం సడలలేదు. క్రమంగా పుంజుకున్న గాఫ్ ధాటికి.. సబలెంకానే పట్టుతప్పింది. ఏకంగా 46 అనవసర తప్పిదాలు చేసింది. కాగా, 1979లో ట్రేసీ ఆస్టిన్, 1999లో సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించారు. అంటే సెరెనా రికార్డు నెలకొల్పేనాటికి గాఫ్ పుట్టనేలేదు. ఇక ఆమె సీజన్ ఆరంభ టోర్నీ వింబుల్డన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడింది. అయినా, ఆత్మవిశ్వాసంతో పుంజుకుని ఆటతీరు మెరుగుపర్చుకుంది.
విశేషం ఏమంటే.. వరుసగా 18 విజయాలతో రెండు టూర్ టైటిల్స్, ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు రూ. 18 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.
మున్ముందు ఆమెదే రాజ్యం
అమెరికా టీనేజ్ సంచలనం గాఫ్ దీనికిముందు నాలుగో డబ్లుటిఏ టూర్ టైటిల్ నెగ్గింది. మహిళా టెన్నిస్ లోకి వివిధ దేశాలకు చెందిన ఎందరో నవయువ క్రీడాకారులు దూసుకొస్తున్నా ఈమెదే భవిష్యత్ అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే 2009 తర్వాత నుంచి టీనేజర్ గా నాలుగు ప్రపంచ మహిళా టెన్నిస్ టూర్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణి గాఫ్ మాత్రమే. యూఎస్ ఓపెన్ కు ముందు వాషింగ్టన్ డీసీ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా 14 సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన తొలి టీనేజర్ గా నిలిచింది.