వన్డే వరల్డ్ కప్.. కామెంటేటర్లు వీరే!
క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇక తెరలేస్తోంది.
By: Tupaki Desk | 30 Sep 2023 6:22 AM GMTక్రికెట్ ప్రేమికులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇక తెరలేస్తోంది. ప్రస్తుతం వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య అసోంలోని గువహటిలో వార్మప్ మ్యాచ్ జరగనుంది.
వరల్డ్ కప్ లో పాల్గొనడానికి ఇప్పటికే దాదాపు అన్ని దేశాల జట్లు భారత్ కు వచ్చాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ అసలు మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మొదటి మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆట ఎంత ముఖ్యమో.. అందుకు తగ్గట్టు కామెంటేటర్ల సందడి కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన అనంతరం నాడు కామెంటేటర్ గా ఉన్న రవి శాస్త్రి వ్యాఖ్యానాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. «క్రికెట్ కామెంటరీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ లో కామెంటేటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. వివిధ దేశాల నుంచి మొత్తం 31 మందికి చోటు ఇచ్చింది.
కామెంటేటర్ల జాబితాలో భారత్ నుంచి నిన్న మొన్నటి వరకు భారత జాతీయ జట్టులో ఉన్న దినేశ్ కార్తీక్ కు చోటు లభించడం విశేషం. అలాగే హర్ష భోగ్లే, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, అంజుమ్ చోప్రాలకు చోటు దక్కింది.
ఇక ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, అరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, డిర్క్ నానెస్, మార్క్ హోవర్డ్, లిసా స్థాలేకర్ లకు కామెంటేటర్లుగా చోటు లభించింది.
అలాగే న్యూజిలాండ్ నుంచి ఇయాన్ స్మిత్, సైమన్ డౌల్, కేటీ మార్టిన్ లకు, ఇంగ్లండ్ నుంచి ఇయాన్ మోర్గాన్, నాసర్ హుస్సేన్, మైకేల్ అథర్టన్, మార్క్ నికోలస్, ఇయాన్ వర్డ్ లకు కామెంటేటర్లుగా ఐసీసీ చోటు కల్పించింది.
పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా, వకార్ యూనిస్, అథర్ అలీఖాన్, వెస్టిండీస్ నుంచి ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ, దక్షిణాఫ్రికా నుంచి షాన్ పొలాక్, కస్తూరి నాయుడు, నటాలీ జెర్మనోస్ లు కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు.
జింబాబ్వే నుంచి ఎంపుమలెగో ఎంబాంగ్వా, శ్రీలంక నుంచి రసెల్ ఆర్నాల్డ్ కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు.