Begin typing your search above and press return to search.

మా లీగ్ లో ఆడకుండా ఐపీఎల్ కెళ్తావా? పేసర్ కు పాక్ నోటీస్

ఈ వారాంతంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక, ప్రేక్షకాదరణ ఉన్న, ప్రతిభావంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది.

By:  Tupaki Desk   |   18 March 2025 4:00 AM IST
మా లీగ్ లో ఆడకుండా ఐపీఎల్ కెళ్తావా? పేసర్ కు పాక్ నోటీస్
X

ఈ వారాంతంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక, ప్రేక్షకాదరణ ఉన్న, ప్రతిభావంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. ఈ నెల 22 నుంచి రెండు నెలల 10 రోజులు ఇక ఒకటే సందడి నెలకొననుంది. ఐపీఎల్ లో క్లిక్ అయితే, ఆయా ఆటగాళ్లు వారి జాతీయ జట్లకు ఎంపికైనట్లే. పైగా మన దేశపు లీగ్ లో వచ్చే ఆదాయం మరెక్కడా రాదు. అందుకే ప్రపంచంలో ఏ జట్టులో ఆటగాడైనా, ఏ లీగ్ లో ఆడే ప్రతిభావంతుడైనా ఐపీఎల్ అవకాశం వస్తే వదులుకోడు. అయితే, దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ కు ఇప్పుడు ఇదే పెద్ద సంకటంగా మారింది.

ప్రతిభావంతుడైన పేసర్ గా బాష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఐపీఎల్ లో దిగ్గజ జట్టయిన ముంబై ఇండియన్స్ అతడిని తీసుకుంది.

కానీ, బాష్ ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్ఎల్)తో ఒప్పందంలో ఉన్నాడు.

వాస్తవానికి పీఎస్ఎల్ ఇప్పటికే మొదలు కావాలి. కానీ, చాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఆలస్యమైంది. మరోవైపు ఐపీఎల్ ఈ నెల 22 నుంచి జరగనుంది. బాష్ రాబోయే పీఎస్ఎల్ ఎడిషన్‌లో పెషావర్ జాల్మీ ఫ్రాంచైజీకి ఆడాల్సి ఉంది. కానీ, ముంబై ఇండియన్స్ అడగగానే పాకిస్థాన్ లీగ్ ను విడిచిపెట్టి వచ్చేశాడు. ఇది పాక్ క్రికెట్ బోర్డుకు ఆగ్రహం తెప్పించింది. పేస్ ఆల్ రౌండర్ బాష్ కు నోటీసు పంపింది. బాష్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడని పీసీబీ లీగల్ నోటీసు జారీ చేసి వివరణ కోరుతోంది.

ఒక ఆటగాడు పీఎస్ఎల్ ను వీడి ఐపీఎల్ కు వెళ్తున్నందుకు లీగల్ నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.