Begin typing your search above and press return to search.

సెంచరీతో మొదలైన ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు ఎవరివో తెలుసా?

2008 ఏప్రిల్ 18.. క్రికెట్ అభిమానులు మరీ ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోని రోజు ఇది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ చెరిగిపోనిది కూడా..

By:  Tupaki Desk   |   15 March 2025 6:00 PM IST
సెంచరీతో మొదలైన ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు ఎవరివో తెలుసా?
X

2008 ఏప్రిల్ 18.. క్రికెట్ అభిమానులు మరీ ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోని రోజు ఇది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ చెరిగిపోనిది కూడా.. కారణం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన రోజు ఇది. అంతేకాదు.. ఐపీఎల్ కు ఇంత ఊపు రావడానికి కూడా ఇదే రోజు బీజం పడింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరిగ్గా 17 ఏళ్ల కిందట 2008 ఏప్రిల్ 18న మొదలైంది. తొలి మ్యాచ్ జరిగింది కూడా ఎవరి మధ్యనో తెలుసా? మేటి బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్యన.

ఏదైనా కార్యక్రమాన్ని మంచి రోజు చూసుకుని మొదలుపెట్టడం భారతీయుల అలవాటు. ఆ రోజ దిగ్విజయం అయితే గనుక ఇక తిరుగుండదని భావిస్తారు. ఇప్పుడు రికార్డుల మీద రికార్డులతో దుమ్మురేపుతున్న ఐపీఎల్ కూడా ఇలానే మొదలైంది..

2008 ఏప్రిల్ 18న కేకేఆర్-ఆర్సీబీ మధ్యన ఐపీఎల్ తొట్ట తొలి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ జట్టులో న్యూజిలాండ్ కు చెందిన హార్డ్ హిట్టర్ బ్రెండన్ మెక్ కల్లమ్ చెలరేగి ఆడాడు. కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 13 సిక్సర్లతో రికార్డు సెంచరీ కొట్టాడు. ఇక అంతే.. మెక్ కల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్ తో ఐపీఎల్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. ఆ తర్వాత ఐపీఎల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది.

మరి అద్భుతమైన సెంచరీతో మొదలై.. మరొక్క వారం రోజుల్లో 18వ సీజన్ కు సిద్ధం అవుతున్న ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసింది ఎవరో తెలుసా?

2008లో మొదలైన ఐపీఎల్ లో ఇప్పటివరకు జట్టు మారనది ఇద్దరే ఇద్దరు. ఒకరు విరాట్ కోహ్లి (ఆర్సీబీ), మరొకరు మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్). కాగా, చెన్నైపై నిషేధంతో ధోనీ రెండేళ్లు పుణె సూపర్ జెయింట్స్ పేరిట వచ్చిన ఫ్రాంచైజీకి ఆడాల్సి వచ్చింది.

ఇక ఐపీఎల్ లో సెంచరీల విషయానికి వస్తే.. కోహ్లి 252 మ్యాచ్ లు ఆడి 8 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. లీగ్ లో 8004 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 113. ఇక సెంచరీ వీరుల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ (7), వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ (6), టీమ్ ఇండియా స్టార్లు శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్ లు నాలుగేసి సెంచరీలు కొట్టారు. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, దక్షిణాఫ్రికాకు చెందిన విధ్వంసక వీరుడు ఏబీ డివిలియర్స మూడేసి సెంచరీల చొప్పున బాదారు. మరి కోహ్లి ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్నాడు. గిల్, రాహుల్ కూడా ఊపు మీద కనిపిస్తున్నారు. బట్లర్, శాంసన్ కూడా బరిలో దిగనున్నారు. వీరు తమ సెంచరీల సంఖ్యను పెంచుకుంటారా?