భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ
ఇదేంటి..? భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ చేయడం ఏమిటి..? సొంతగడ్డ అంటే న్యూజిలాండ్ అవుతుంది కదా..?
By: Tupaki Desk | 18 Oct 2024 9:42 AM GMTఇదేంటి..? భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ చేయడం ఏమిటి..? సొంతగడ్డ అంటే న్యూజిలాండ్ అవుతుంది కదా..? అనుకునేరు.. మీరు చదివింది కరెక్టే. భారత్ లోని ‘సొంతగడ్డ’పైనే అతడు సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరులో తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనే పైన చెప్పిన సందర్భం ఎదురైంది.
అప్పుడు ప్రపంచ కప్ లో..
నిరుడు ఇదే సమయంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర చెలరేగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి స్పిన్నర్ అయిన రవీంద్రను న్యూజిలాండ్ ఆ విధంగానే చూసింది. కానీ, జట్టు అవసరాల రీత్యా రవీంద్ర బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దుమ్మురేపాడు. ఇప్పుడు తొలి టెస్టులోనూ తనదైన ముద్ర చాటాడు. ప్రధాన బ్యాట్స్ మన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన రచిన్ ఏకంగా సెంచరీ (157 బంతుల్లో 134, 13 ఫోర్లు, 4 సిక్స్ లు) బాదాడు. దీంతో న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. దీంతో భారత్ పై 356 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
సొంతగడ్డపైన..
రచిన్ రవీంద్ర పూర్వీకులది బెంగళూరు. ఇప్పటికీ అతడి నానమ్మ, తాతయ్య ఇక్కడే ఉంటారు. గత ఏడాది ప్రపంచ కప్ సందర్భంగా మ్యాచ్ కు కూడా వీరు హాజరయ్యారు. తాజాగా టెస్టు మ్యాచ్ కూ రచిన్ బంధువులు వచ్చినట్లు కనిపించింది. అందుకే భారత్ లోని సొంతగడ్డపై న్యూజిలాండ్ క్రికెటర్ సెంచరీ అని చెప్పాల్సి వచ్చింది. కాగా, భారత్ పై ఏకంగా 356 పరుగుల ఆధిక్యం రావడానికి ప్రధాన కారణం రచిన్ రవీంద్రనే. అతడి సూపర్ ఇన్నింగ్స్ తో ఇప్పుడు న్యూజిలాండ్ భారత్ లో భారత్ ను ఓడించే స్థితికి చేరింది.