Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాలో ఇంగ్లిష్ క్రికెటర్.. ఎవరీ వాషింగ్టన్?

అమ్మ భాషకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడుకు చెందిన అతడి పేరులో ఇంగ్లిష్ వ్యక్తి పేరు ఉండడం ఆశ్చర్యమే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 6:53 AM GMT
టీమ్ ఇండియాలో ఇంగ్లిష్ క్రికెటర్.. ఎవరీ వాషింగ్టన్?
X

అమ్మ భాషకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడుకు చెందిన అతడి పేరులో ఇంగ్లిష్ వ్యక్తి పేరు ఉండడం ఆశ్చర్యమే. 150 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో కనీసం 50 కోట్ల మంది క్రికెట్ ఆడే దేశంలో.. ఒక విదేశీయుడి పేరున్న ఆటగాడు టీమ్ ఇండియాలోకి వచ్చాడు. అయితే, అతడేమీ విదేశీయుడు కాదులెండి.. అచ్చమైన భారతీయుడు.. అందులోనూ నిఖార్సయిన తమిళుడు.. కానీ, పేరులో మాత్రం ఇంగ్లిష్. ఇంతకూ అతడు ఎవరు అంటే..?

ఆరేడేళ్లుగా జట్టుతోనే ఉన్నా..

టీమ్ ఇండియాలో 2018లోనే అరంగేట్రం చేశాడు తమిళనాడు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. కేవలం 17 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన అతడు 2018లో శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీలో కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. ఏమాత్రం బెరుకు లేకుండా బంతులేసిన సుందర్.. పరుగులు ఇవ్వడంలో పిసినారితన చూపాడు. దీంతో ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. కాగా, సుందర్.. ఆ తర్వాత టీమ్ ఇండియాలోకి వస్తూ పోతూ ఉన్నాడు. ముఖ్యంగా టి20ల్లోకి. అయితే, వన్డేలు, టెస్టుల్లో స్థానం మాత్రం పదిలం కాలేదు.

అనూహ్యంగా వచ్చి..

న్యూజిలాండ్‌ తో పుణెలో జరిగే రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్ ను అనూహ్యంగా ఎంపిక చేశారు. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఓటమి అనంతరం సుందర్ అవసరాన్ని గుర్తించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. దీంతో వెంటనే జట్టుతో చేర్చారు. వాస్తవానికి 45 నెలల తర్వాత అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు సుందర్. అయినా 23.1 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ 259 పరుగులకే ఆలౌటైంది అంటే అది సుందర్ కారణంగానే. కాగా, తమిళనాడుకు చెందిన సుందర్ పేరులో వాషింగ్టన్ అని ఉండడంతో మొదటి నుంచి అందరూ ఎవరితడు? అని ఆశ్చర్యంగా చూశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారిపై ఉన్న అభిమానంతో సుందర్ తండ్రి మణి సుందర్.. తన కుమారుడికి వాషింగ్టన్ సుందర్ అని పేరు పెట్టాడు. మణి ఒకప్పుడు రంజీ ఆటగాడు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన మణికి క్రీడలంటే చాలా ఇష్టం. అతడికి పీడీ వాషింగ్టన్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ అధికారి క్రికెట్‌ ఆడేందుకు ఆర్థిక సాయం చేశారు. చదువుకూ సహకరించారు. ఆయనపై ప్రేమతోనే కుమారుడికి ‘వాషింగ్టన్‌’ అనే పేరు పెట్టారు.

అప్పుడు రాణించినా..

2018 నిదహాస్ టోర్నీ, 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో సుందర్ రాణించినా జాతీయ జట్టులో చోటు సుస్థిరం కాలేదు. ఆసీస్ సిరీస్ నాడు నెట్‌ బౌలర్‌ గా వెళ్లిన సుందర్.. సీనియర్‌ ఆటగాళ్లంతా గాయాలకు గురికావడంతో ‘గబ్బా టెస్టు’లో అనూహ్యంగా ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ ల్లో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇప్పుడు కూడా అనుహ్యంగా జట్టులోకి వచ్చాడు. రంజీ మ్యాచ్ లో ఢిల్లీపై వన్ డౌన్ లో దిగి భారీ సెంచరీ (152; 269 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌) సాధించడం సుందర్ ను గంభీర్ పట్టుబట్టి జట్టులో చోటు కల్పించేలా చేసింది.