Begin typing your search above and press return to search.

ఆ ఒక్కడి దిమాక్.. టీమిండియా ఆటగాళ్లందరికీ అల్టిమేటం

అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటివారిలో జార్ఖండ్ కు చెందిన ఇషాన్ కిషన్ ఒకడు

By:  Tupaki Desk   |   22 Feb 2024 2:30 AM GMT
ఆ ఒక్కడి దిమాక్.. టీమిండియా ఆటగాళ్లందరికీ అల్టిమేటం
X

వన్డేల్లో అరుదైన డబుల్ సెంచరీ సాధించి.. టి20ల్లో మెరుపు బ్యాట్స్ మన్ గా పేరుతెచ్చుకుని.. టెస్టుల్లోనూ అవకాశం దక్కించుకున్న ఒక్క ఆటగాడు చేసిన నిర్లక్ష్యపు వ్యవహార శైలి ఇప్పుడు టీమిండియా క్రికెటర్ల మెడకు చుట్టుకుంది. 20 ఏళ్లు వెనక్కువెళ్తే.. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన ఆటగాడు రంజీ ట్రోఫీ ఆడి ఫామ్ చాటుకోవాలి.. అప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు.. లేదంటే ఇక అంతే.. కానీ, ఇప్పుడు అలాంటిదేం లేదు. పేరుకు పేరు, అడ్వర్టయిజ్ మెంట్లకు రూ.కోట్ల డబ్బు.. మధ్యలో ఐపీఎల్ వంటి లీగ్.. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా రంజీలు ఆడే ఉద్దేశమే లేదు.. జూనియర్ల నుంచి స్టార్ క్రికెటర్ల వరకు ఇదే తీరు. ఇకపై ఈ దిమాక్ కు చెల్లుచీటీ పడనుంది. ఎంతటి ఆటగాడైనా.. జాతీయ జట్టులో చోటు కోల్పోతే వచ్చి రంజీలాడాల్సిందే.

ఆ ఒక్కడి దెబ్బతో..

అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటివారిలో జార్ఖండ్ కు చెందిన ఇషాన్ కిషన్ ఒకడు. అయితే, డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతడు టెస్టులు ఆడకుండానే మధ్యలో వచ్చేశాడు. అలసటతో పాటు మానసిక సమస్యలను కారణంగా చూపాడు. బీసీసీఐ కూడా ఇదే చెప్పింది. అయితే, అసలు విషయం అది కాదు. ఇషాన్ కిషన్ కు ప్రపంచ కప్ నుంచి తుది జట్టులో అవకాశాలు రావడం లేదు. దీంతోనే అతడు అసహనం చెంది స్వదేశానికి వచ్చేశాడనేది టాక్. ఇది టీమ్ మేనేజ్ మెంట్ కు కోపం తెప్పించింది. ఆస్ట్రేలియా సిరీస్‌ కు ఇషాన్ ను పక్కనపెట్టారు. ఇదే సమయంలో ఇషాన్ అయినా మరెవరైనా టీమిండియాలోకి తిరిగి రావాలనుకుంటే దేశవాళీ ప్రదర్శనే ప్రామాణికం అని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం రంజీ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఇషాన్ తన సొంత రాష్ట్రం జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడి జాతీయ జట్టులోకి వచ్చే ప్రయత్నం చేస్తాడని భావిస్తే అదేమీ చేయలేదు. జార్ఖండ్ కు అతడి సేవలు అవసరం ఉన్నప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా ముంబై వెళ్లి హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఒళ్లు మండిన బీసీసీఐ..

ఇషాన్ కిషన్ వ్యవహారం బీసీసీఐకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అటు టీమిండియా మేనేజ్ మెంట్, ఇటు బీసీసీఐ సూచనను లెక్కచేయకపోవడంతో కిషన్ అంతర్జాతీయ కెరీర్ పెద్ద చిక్కుల్లో పడింది. అతడు రంజీల్లో కాకుండా ముంబైలో జరిగే డీవై పాటిల్ టి20 టోర్నీలో ఆడబోతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీ ని ఇషాన్ తేలిగ్గా తీసుకోవడం బీసీసీఐ కళ్లు తెరిపింది. దీంతో భారత క్రికెటర్లు జట్టుతో లేనపుడు కచ్చితంగా రంజీ ట్రోఫీ ఆడాలనే నిబంధన తేవాలని, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత క్రికెటర్లకు లేఖ కూడా రాశాడు. జాతీయ జట్టుకు ఆడనప్పుడు రంజీ ట్రోఫీనే కాక.. ఇతర దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనాలని తేల్చిచెప్పాడు.