డబుల్ సెంచరీ కొట్టిన టీమిండియా యువ ఓపెనర్ కు కష్ట కాలం..
టెస్టులు, వన్డేలు, టి20లు అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టి.. ఏడాదిలోనే టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ గా ఎదిగిన యువ ఓపెనర్ కు గడ్డు కాలం ఎదురైంది
By: Tupaki Desk | 9 Sep 2023 12:30 PM GMTటెస్టులు, వన్డేలు, టి20లు అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టి.. ఏడాదిలోనే టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ గా ఎదిగిన యువ ఓపెనర్ కు గడ్డు కాలం ఎదురైంది. అతడి బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు రావడం అనూహ్యంగా ఆగిపోయింది. మొన్నటివరకు అదరగొట్టిన కుర్రాడు ఇతడేనా? అనేంతగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచ కప్ ముంగిట అనూహ్య వైఫల్యం అతడితో పాటు జట్టునూ కలవరపెడుతోంది. ఆసియా కప్ లోనైనా జోరందుకోకపోతే ప్రపంచ కప్ తుది జట్టులో చోటు కష్టమే.
టి20ల్లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లోనూ సెంచరీలు.. ఇదీ మూడు నెలల కిందటి వరకు ఓపెనర్ శుబమన్ గిల్ ఫామ్. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ అతడు అదరగొట్టాడు. కానీ, అంతలోనే ఫామ్ కోల్పోయాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో విఫలయ్యాడు. 7-34-85-3-7-6-77-9-10-67.. ఇవీ గిల్ తాజా స్కోర్లు. పది ఇన్నింగ్స్ లో ఆరుసార్లు పది పరుగుల్లోపే ఔటయ్యాడు. దీన్నిబట్టే గిల్ ఏదో ఇబ్బందిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఆసియా కప్ లో ఆడకుంటే..?
జట్టులో ఎంత పోటీ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆసియా కప్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. మరో యువ బ్యాట్స్ మన్, ఎడమ చేతివాటం ఇషాన్ కిషన్ ను కాదని మరీ గిల్ ను ఆడిస్తున్నారు. కానీ, అతడు అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ టూర్లలో విఫలమయ్యాడు. ఆసియా కప్ పాక్ మీద తొలి మ్యాచ్ లో విఫలమైనా.. నేపాల్ వంటి చిన్న జట్టుపై అర్ధ సెంచరీ చేశాడు. కానీ, ఆదివారం పాక్ తో మ్యాచ్ లో విఫలమైతే మాత్రం ఇబ్బందే.
సిద్ధంగా.. రాహుల్ , కిషన్
ప్రతిభావంతుడైన గిల్ త్వరగానే ఫామ్ అందుకుంటాడని జట్టు యాజమాన్యం భావిస్తుండవచ్చు. అయితే, ఆసియా కప్ ఫైనల్ నాటికి అతడు మెరుగు పడకుంటే మాత్రం ప్రపంచ కప్ తుది జట్టులో చోటు కష్టమే. ఎందుకంటే స్వతహాగా ఓపెనర్ అయిన, వికెట్ కీపింగ్ కూడా చేస్తున్న కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగొచ్చాడు. దీనికితోడు ఇషాన్ కిషన్ ఎలాగూ ఉన్నాడు. గిల్ వైఫల్యం కొనసాగితే వీరిలో ఒకరు అతడి స్థానాన్ని భర్తీ చేయడం ఖాయం.
రోహిత్ వ్యాఖ్యలు ఓ హెచ్చరిక..
''అవసరమైతే తుది జట్టులో రాహుల్, కిషన్ ఇద్దరూ ఉంటారు'' కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ జట్టు ఎంపిక అనంతరం చేసిన వ్యాఖ్య ఇది. అంటే.. గిల్ ఫామ్ అందుకోకుంటే అతడి స్థానంలో కిషన్ వస్తాడు. రాహుల్ మిడిలార్డర్ లో దిగుతాడని అర్థం. ఇది ఓ రకంగా గిల్ కు హెచ్చరికే. అయితే, గిల్ ప్రొలిఫిక్ ప్లేయర్. మంచి టెక్నిక్ తో రాహుల్, కిషన్ కంటే ధారాళంగా పరుగులు రాబడతాడు. కాబట్టి ఇప్పటికైతే గిల్ ఫామ్ అందుకోవాలనే భావిద్దాం.