తి'లక్' వర్మ.. లక్ష్మణ్..రాయుడికి దక్కనిది అతడికి?
అతడు టీమిండియాకు చాన్నాళ్లు ఆడతాడని.. క్రీజులో నిలదొక్కకుని జట్టును గెలిపిస్తాడని
By: Tupaki Desk | 10 Aug 2023 4:30 PM GMTప్రస్తుతం హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ టైం నడుస్తున్నట్లుంది. ఆడింది మూడు అంతర్జాతీయ మ్యాచ్ లే.. అవి కూడా టి20లు. వన్డే జట్టులోకి ఎంపికవనే లేదు. కానీ, అతడి పేరు వన్డే ప్రపంచ కప్ జట్టుకు వినిపిస్తోంది. వారం రోజుల కిందటి వరకు అతడి ఆట గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మూడంటే మూడే ఇన్నింగ్స్ లు చూసి ఫినిషర్ వచ్చాడని అంటున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పట్టుదలతో పరిణతితో బ్యాటింగ్.. ఒత్తిడి మధ్య కూడా సిక్స్ లు కొట్టడం చూసి మాజీలు, దిగ్గజాలు పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇలాంటివారిలో బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్, నిన్నటి వరకు టీమిండియా హెడ్ కోచ్ గా పనిచేసిన రవిశాస్త్రి ఉండడం గమనార్హం. అంతగా నచ్చేసింది తిలక్ ఆటతీరు వారికి.
నిలదొక్కుకుంటాడు.. నిలబడతాడు
హైదరాబాదీ తిలక్ గురించి ఇప్పుడు అందరూ చెప్పేది ఒకే మాట. అతడు టీమిండియాకు చాన్నాళ్లు ఆడతాడని.. క్రీజులో నిలదొక్కకుని జట్టును గెలిపిస్తాడని. వెస్టిండీస్ టి20 సిరీస్ లో తిలక్ మూడు మ్యాచ్ ల్లో 39, 51, 49 (నాటౌట్) పరుగులు చేశాడు. టీమిండియాలో ఇప్పుడు అత్యధిక స్కోరర్ అతడే. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిలక్ నిబ్బరంగా ఆడాడు. భారీ షాట్లు కొట్టాడు. మూడో టి20లో వస్తూనే రెండు ఫోర్లు కొట్టి తన దూకుడెలాంటిదో చాటాడు. 20 ఏళ్ల తిలక్ చూపిస్తున్న పరిణతి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలోనూ చాలాకాలం ఆడతాడని అంచనా వేస్తున్నారు.
ఆ ఇద్దరికీ దక్కనిది..?
హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు ఇద్దరూ వన్డే ప్రపంచ కప్ ఆడలేకపోయారు. మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మాత్రమే వరల్డ్ కప్ లు ఆడాడు. మూడు కప్ లలో కెప్టెన్ గానూ వ్యవహరించడం విశేషం. అయితే, లక్ష్మణ్, రాయుడికి మాత్రం ఈ గొప్ప అవకాశం దక్కలేదు. 2001లో టెస్టుల్లో అద్భుతమైన 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన లక్ష్మణ్ 2003 నాటికి వన్డే ప్రపంచ కప్ జట్టులోకి రాలేకపోయాడు. రాయుడూ అంతే.. 2018 వరకు మిడిలార్డర్ లో నమ్మదగిన బ్యాట్స్ మన్ గా ఉన్న రాయుడికి ఆ మరుసటి ఏడాది కప్ లో చోటే దక్కలేదు. కానీ, తిలక్ మాత్రం చాన్స్ కొట్టేసేలా ఉన్నాడు. భారత్ లో అక్టోబరులో మొదలయ్యే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌లో ఆడతాడన్న చర్చ మొదలైంది. కాగా, తిలక్ గత సీజన్ లో ఐపీఎల్ లో 11 మ్యాచ్‌ల్లోనే 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 164.11. 2022 సీజన్ లో 14 మ్యాచ్‌లలో 397 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 131.02గా ఉంది.
ఎడమచేతివాటమే లక్..?
మంచి టెక్నిక్, నిలకడ, దూకుడు కలగలిసిన తిలక్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ కావడం అతడికి0 కలిసొచ్చే అంశం. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కావడం మరీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఫినిషర్ పాత్ర పోషించగల సామర్థ్యం.. మిడిలార్డర్ లో ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అవసరం తిలక్ పాలిట అనుకోని వరం. ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ అతడు ఓపెనింగ్ చేస్తున్నాడు. మిడిలార్డర్ లో ఆడే రాహుల్, అయ్యర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు.
దాదాపు ఆరు నెలలు మ్యాచ్ ప్రాక్టీస్ లేని వారిని నేరుగా ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయడం కష్టం. అన్నిటికి మించి 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో రాణించడం లేదు. దీంతోనే అందరూ తిలక్ గురించి చెబుతున్నారు. ఫామ్ ను కొనసాగిస్తే అతడు ప్రపంచ కప్ రేసులో ఉంటాడు. అయితే, తిలక్ ముందుగా వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ నకు ఎంపికవ్వాల్సి ఉంది. అందులోనూ అతడు సత్తా చాటితే ప్రపంచ కప్ బెర్తు కొట్టేసినట్లే.