ఔరా చెన్నై సూపర్ కింగ్స్.. 180 ప్లస్ టార్గెట్ కొట్టలేక ఐదేళ్లా?
ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గురించి ఇదంతా.
By: Tupaki Desk | 31 March 2025 8:30 PMజట్టులో మొనగాళ్ల లాంటి బ్యాట్స్ మెన్.. ఫినిషింగ్ లో దమ్మున్న బ్యాట్స్ మెన్.. కానీ, ఆ జట్టు ఐదేళ్లయిందట 180 పరుగులపైగా టార్గెట్ ను ఛేదించి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓవైపు కొన్ని జట్లు 200 టార్గెట్ ను 16 ఓవర్లలోనే ఛేదించేస్తుండగా.. ఛేజింగ్ లో సూపర్ అయిన ఆ జట్టు మాత్రం 180 ప్లస్ టార్గెట్ ను ఐదేళ్లుగా కొట్టలేకపోతోంది. ఇది గణాంకాలు చెబుతున్న సత్యం.
ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గురించి ఇదంతా. ఇప్పటికే చెన్నైలో గతంలో తరహాగా దూకుడుగా ఆడలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. బ్యాటర్లు తేలిగ్గా పరుగులు చేయలేకపోతున్నారు.
ప్రస్తుత సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 160 పరగులు టార్గెట్ ను చివరి ఓవర్ లో చేరుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో రెండో మ్యాచ్ లో 197 పరుగుల టార్గెట్ ను 50 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక మూడో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 183 పరుగుల టార్గెట్ ఛేదనలో 176కే పరిమితం అయింది.
ఇదే కాదు.. ఐదేళ్లలో చెన్నై 180 ప్లస్ టార్గెట్ ఒక్కసారీ ఛేదించలేదంట. దీనిని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తావించాడు.
వాస్తవానికి చెన్నై అంటే మహేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ అంటే చెన్నై. వయసు మీద పడిన ధోనీ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడడం లేదనే విమర్శలున్నాయి. లేదంటే అతడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందే వచ్చేవాడు.
ఆదివారం రాజస్థాన్ పై 2 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ధోనీ ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు. ఇదివరకటి ధోనీ అయితే ఒకే ఓవర్‌లో 25 పరుగులు చేశాడు. 2016 సీజన్ లో కుర్రాడిగా ఉన్న అక్షర్ పటేల్ బౌలింగ్ లో విరుచుకుపడ్డాడు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ ఓవర్ లోనూ 20 పరుగుల కొట్టాడు. ఈ రెండు సందర్భాల్లోనే కాక చాలాసార్లు ధోనీ ఫినిషింగ్ చేశాడు. ఇప్పుడు వీటన్నిటినీ సెహ్వాగ్ ప్రస్తావించాడు. పరోక్షంగా చెన్నై, ధోనీ సత్తా తగ్గిందని పేర్కొన్నాడు.