Begin typing your search above and press return to search.

ఇదేం విడ్డూరం.. రిటైరయ్యాక క్రికెటర్ కెప్టెన్సీపై నిషేధం ఎత్తివేత

ఎవరైనా అంతర్జాతీయ/జాతీయ క్రికెటర్ ను రిటైరయ్యాక సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది..? చనిపోయిన వ్యక్తికి మరణ శిక్ష వేస్తే ఎలా ఉంటుంది..?

By:  Tupaki Desk   |   25 Oct 2024 7:43 AM GMT
ఇదేం విడ్డూరం.. రిటైరయ్యాక క్రికెటర్ కెప్టెన్సీపై నిషేధం ఎత్తివేత
X

ఎవరైనా అంతర్జాతీయ/జాతీయ క్రికెటర్ ను రిటైరయ్యాక సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది..? చనిపోయిన వ్యక్తికి మరణ శిక్ష వేస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేసిన పని అలానే ఉంది.. ఆరేళ్ల కిందటి ఘటన.. ఐదేళ్ల కిందటే శిక్ష పూర్తి.. ఏడాది కిందటే ఆ క్రికెటర్ రిటైర్ అయ్యాడు.. ఇక అతడు మైదానంలోకి దిగే చాన్సే లేదు.. ఎందుకంటే వయసు కూడా పైబడింది.. అలాంటి క్రికెటర్ పై ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని ఎత్తివేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఇంతకూ ఏం జరిగిందంటే..?

ఆరేళ్ల కిందట సంచలనం

2018లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లింది. అప్పుడు స్టీవ్‌ స్మిత్ కెప్టెన్. డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్. అయితే, దక్షిణాఫ్రికా నుంచి గట్టి పోటీ ఎదురైంది ఆ సిరీస్ లో. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ లో చెరో టెస్టు గెలుచుకున్నాయి. అయితే, మూడో టెస్టులో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ సాగుతుండగా ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ బాన్‌ క్రాఫ్ట్‌ జేబులోంచి ఏదో వస్తువు తీసి బంతిని రుద్దుతున్నట్లు కనిపించాడు. గరుకుగా ఉన్న ఆ వస్తువును సాండ్‌ పేపర్‌ గా తర్వాత తేల్చారు. బంతి ఆకారాన్ని మార్చి.. స్వింగ్ కు అనుకూలించేలా చేసేందుకు ఆస్ట్రేలియా పన్నాగ పన్నిందనే ఆరోపణలు వచ్చాయి. దీనివెనుక ఉన్నది డేవిడ్‌ వార్నర్ అని.. బాన్‌ క్రాఫ్ట్‌ ను అలా చేయమని చెప్పింది అతడేనని తర్వాత తేలింది. ఆట ముగిశాక ఆ రోజు సాయంత్రం మీడియాతో బాన్‌ క్రాఫ్ట్‌ తాను సాండ్‌పేపర్‌ ను ఉపయోగించినట్లు ఒప్పుకొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. బాన్‌క్రాఫ్ట్‌ పై ఆరు నెలల నిషేధం వేసింది. అప్పటికి వైస్ కెప్టెన్ అయిన వార్నర్‌ ను ఇక ‘జీవిత కాలం’లో కెప్టెన్సీ చేపట్టకుండా చేసింది. స్మిత్, వార్నర్ లు ఏడాది నిషేధం ఎదర్కొన్నారు. ఆ తర్వాత ఐపీఎల్ లోనే పునరాగమనం చేశారు.

స్మిత్, వార్నర్ 2019 నుంచి వన్డే, టి20 ప్రపంచ కప్ లు ఆడారు. 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత వార్నర్ వన్డేలకు, ఈ ఏడాది ప్రారంభంలో టెస్టులకు, జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ తర్వాత టి20లకూ వీడ్కోలు పలికాడు. మొత్తానికి అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. అయితే, మళ్లీ ఏమనుకున్నాడో ఏమో.. ఇటీవల టెస్టు రిటైర్మైంట్ ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించాడు.

కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేత ఎందుకు?

వార్నర్‌ పోటీ క్రికెట్ నుంచి తప్పుకొన్నాక.. అతడిపై ఉన్న ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తాజాగా ప్రకటించింది. తనపై బ్యాన్‌ తొలగించాలని ఇప్పటికే వార్నర్ కోరాడు. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ సమీక్ష అనంతరం వార్నర్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఏ ప్రకటించింది. అయితే, వార్నర్ ఆడడం లేదు కాబట్టి.. ఇది ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ కు వర్తించదు. కాగా, రాబోయే బిగ్‌ బాష్‌ లీగ్‌ లో ఓ ఫ్రాంచైజీ జట్టుకు కెప్టెన్సీ చేసేందుకు అవకాశం దొరికినట్లైంది. వార్నర్ సిడ్నీ థండర్స్‌ కు నాయకత్వం వహించనున్నాడు. సాండ్ పేపర్ ఘటనలో వార్నర్ పొరపాటుకు బాధ్యత వహించాడని.. అందుకే నిషేధాన్ని సమీక్షించామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. నిషేధం అనంతరం అతడి ప్రవర్తన చాలా బాగుందని.. ప్రత్యర్థి జట్టుపై స్లెడ్జింగ్, కవ్వింపు చర్యలు చేయలేదని పేర్కొంది. అందుకే నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని వివరించింది.

అంతా అయిపోయాక..

వాస్తవానికి సాండ్ పేపర్ సూత్రధారి తానేనని వార్నర్ ఆ ఘటన జరిగిన వెంటనే ప్రకటించాడు. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. కుటుంబం కూడా ఎంతో బాధపడినట్లు చెప్పాడు. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించలేదు. ఏడాది నిషేధం అనంతరం జట్టులోకి తిరిగి తీసుకున్నా.. కెప్టెన్సీపై నిషేధాన్ని మాత్రం తొలగించలేదు. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తరహాలోనే.. వార్నర్ కూడా దేశానికి కెప్టెన్ కాలేదన్న తీవ్ర వేదనతోనే రిటైరయ్యాడు. కానీ, ఇప్పుడు అదే ఆస్ట్రేలియా బోర్డు అతడి కెరీర్ ముగిశాక నిర్ణయం తీసుకుంది.