Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్.. ఐపీఎల్ కంటే వార్నర్ కు బాగానే గిట్టుబాటు

అంతకుముందు క్యాపిటల్స్ పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   27 March 2025 10:05 AM
Warner gets high then ipl
X

15 ఏళ్ల కిందట ఐపీఎల్ లో అరంగేట్రం.. వరుసగా 16 సీజన్లలో ప్రాతినిధ్యం.. రెండే ఫ్రాంచైజీలు.. రెండుసార్లు చాంపియన్.. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్థానం.. 2009లో దక్కన్ చార్జర్ (డీసీ) తరఫున చాంపియన్ జట్టులో భాగమైన వార్నర్.. 2013 వరకు ఆ జట్టుకే ఆడాడు. ఈ జట్టు 2014 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారాక కూడా కొనసాగాడు. 2016లో కెప్టెన్ గా టైటిల్ అందించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాంటి వార్నర్ 2022లో మళ్లీ డీసీకి మారాడు. ఇక్కడ డీసీ అంటే దక్కన్ చార్జర్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్. అంతకుముందు క్యాపిటల్స్ పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ కావడం గమనార్హం. అంటే.. వార్నర్ ఆడిన రెండు ఫ్రాంచైజీలూ పేర్లు మారినవే అన్నమాట.

కాగా, గత నవంబరులో జరిగిన మెగా వేలంలో వార్నర్ ను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. వార్నర్ ఐపీఎల్ రికార్డు చూస్తే కళ్లు చెదరాల్సిందే. మొత్తం 6,565 పరుగులు చేసిన వార్నర్ నాలుగు సెంచరీలు బాదాడు. 62 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే, గత సీజన్ లో వార్నర్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. 8 మ్యాచ్‌లలో 168 పరుగులే చేశాడు. 38 ఏళ్ల వయసు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం, గాయాల బెడద కూడా ఉండడంతో వార్నర్ ను ఏ ఫ్రాంఛైజీ కూడా తీసుకోలేదు. అయితే, వార్నర్ ను పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ప్లాటినం కేటగిరీలో అతడిని కరాచీ కింగ్స్ తీసుకుంది.

వేలంలో తీసుకున్నా...

గతంలో రూ.కోట్లకు కోట్లు ధర పలికినా.. వార్నర్ ఈ సీజన్ కు మాత్రం మెగా వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. కానీ, ఎవరూ కొనుగోలుచేయలేదు. అయితే, ఈ లోటు అతడికి భర్తీ అయింది.

తెలుగులో నితిన్ హీరోగా వార్నర్ ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. అయితే, రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ క్యారెక్టర్ 2.50 నిమిషాలే ఉంటుందట. కానీ, అందుకే అతడు రూ.2 కోట్లు తీసుకున్నాడని సమాచారం. రాబిన్ హుడ్ కు రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న వార్నర్ రూ.2 కోట్లకు పైగా పొందడం అంటే విశేషమే. ఈ సినిమా ప్రమోషన్లలోనూ వార్నర్ పాల్గొన్నాడు.

ఈ సీజన్ లో 70 రోజులకు పైగా సాగే ఐపీఎల్ లో పాల్గొన్నప్పటికీ వార్నర్ కు దక్కేది మహా అంటే రూ.2 కోట్లకు మించకపోయేది. కానీ, 3 నిమిషాల లోపు నటించిన సినిమాకే రూ.2 కోట్లు రావడం విశేషం.