Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ క్రికెట్ కు ఓ దిగ్గజం గుడ్ బై.. ఇక ఐపీఎల్ లోనే?

అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి తీవ్ర పోటీ ఉండే లీగ్ లోనూ అతడు సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు

By:  Tupaki Desk   |   25 Jun 2024 11:49 AM GMT
అంతర్జాతీయ క్రికెట్ కు ఓ దిగ్గజం గుడ్ బై.. ఇక ఐపీఎల్ లోనే?
X

అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఆటగాడు అందులోనూ ఒక ఓపెనర్ మూడు ఫార్మాట్లలోనూ ఆడడం సాధ్యం కాదు.. ఏదో కొన్ని దేశాల క్రికెటర్లకు మాత్రమే ఇది వీలవుతుంది. అతడు అలాంటివాడే. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి తీవ్ర పోటీ ఉండే లీగ్ లోనూ అతడు సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు. ఓసారి టైటిల్ కూడా సాధించాడు. కానీ, ఇకపై అతడు అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించడు. చూస్తేగీస్తే.. ఫిట్ నెస్ సహకరిస్తే ఐపీఎల్ లోనే.

15 ఏళ్ల కెరీర్ కు బైబై..

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ అంతర్జాతీయ కెరీర్‌ ను ముగించాడు. గత ఏడాది చివర్లోనే టెస్టులకు అతడు బైబై చెప్పాడు. వన్డేలకు కూడా ఇటీవల వీడ్కోలు పలికాడు. మిగిలిన టి20 ఫార్మాట్ నుంచి కూడా మంగళవారం తప్పుకొన్నాడు. వెస్టిండీస్ లో జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా

సూపర్ 8కు పరిమితమైంది. సెమీస్ కు వెళ్లలేకపోయింది. ఇదే సమయంలో వార్నర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టి20 ప్రపంచకప్‌ తర్వాత ఆడనని గతంలోనే అతడు చెప్పాడు.

సన్ రైజర్స్ విన్నింగ్ కెప్టెన్

ఐపీఎల్ లో అత్యధిక కాలం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సూపర్ హిట్ సినిమా ‘పుష్ప’లో పాపులర్ డైలాగ్ ‘తగ్గేదేలే’కు తనదైన రీతిలో అభినయించాడు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన యాడ్ లోనూ నటించాడు. ఈ విధంగా తెలుగు ప్రజలతో వార్నర్ కు అనుబంధం ఉంది. కాగా, వార్నర్ ఈ ఏడాది సీజన్ లో ఢిల్లీకి ఆడాడు. మరోవైపు వార్నర్ 110 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఒక సెంచరీ, 28 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 3,277 పరుగులు సాధించాడు. టెస్టులు, వన్డేలు, టి20లు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన మూడో ఆసీస్‌ ఆటగాడు వార్నర్. టి20 లీగ్స్‌ లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.