అతడు డెవిల్ కాన్వే.. డేంజర్ మ్యాన్
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే గురించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇకపై మాత్రం అతడెవరో తెలుసుకునే వరకు వదలరు.
By: Tupaki Desk | 6 Oct 2023 3:30 PM GMTభారత్ లో ప్రపంచ కప్ జరుగుతోంది కాబట్టి దంచికొట్టే బ్యాట్స్ మన్ ఎవరు..? రోహిత్ శర్మనా? విరాట్ కోహ్లీనా..? బ్యాటింగ్ పిచ్ లు కాబట్టి ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ చెలరేగుతాడా? పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ గా ఎదుగుతాడా? టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ సెంచరీల మీద సెంచరీలు కొడతాడా? చర్చలన్నీ ఇలానే జరుగుతున్నాయి. కానీ, వీరందరినీ మించి ఓ బ్యాట్స్ మన్ ఉన్నాడు.
కళాత్మక విధ్వంసం..
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే గురించి ఇప్పటివరకు ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఇకపై మాత్రం అతడెవరో తెలుసుకునే వరకు వదలరు. కొంతకాలంగా నిలకడగా ఆడుతన్న కాన్వే.. ప్రపంచ కప్ తొలి మ్యాచ్ గురువారం ఇంగ్లండ్ పై చేసిన అజేయ సెంచరీని ఎవరూ తొందరగా మర్చిపోలేరు. ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన కాన్వే.. బ్యాటింగ్ కళాత్మకంగా ఉంటుంది. అతడు దూకుడుగా ఆడకపోవచ్చు.. కానీ సంప్రదాయ శైలిలో ఆడుతూనే స్కోరును ఎక్కడికో తీసుకెళ్లడం సెంచరీలు కొట్టేయడం కాన్వేకు బ్యాటుతో పెట్టిన విద్య.
ఆలస్యంగా వచ్చినా..
32 ఏళ్ల కాన్వే అంతర్జాతీయ క్రికెట్లోకి ఆలస్యంగా వచ్చాడు. 30 ఏళ్ల వయసులో రెండేళ్ల కిందటే అతడ టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ, ఈ వ్యవధిలోనే నిరూపించుకున్నాడు. కివీస్ కు స్థిరమైన ఓపెనర్ గా పాతుకుపోయి పరుగులు చేస్తున్నాడు. 16 టెస్టుల్లో 14,00 పరుగులు, 23వన్డేల్లో 1,006 పరుగులు చేశాడు. 41 టి20ల్లో 1,248 పరుగులు సాధించాడు.
సీఎస్కేకు మూల స్తంభం
రెండేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వెనుకబడి పోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది విజేతగా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. తనదైన శైలిలో ఆరంభాలను ఇచ్చిన కాన్వే జట్టుకు మంచి స్కోరు అందించడంలో సాయపడ్డాడు.
అతడికి ఆపకుంటే అంతే..
ప్రస్తుత ప్రపంచ కప్ లో ఇతర జట్ల ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా.. న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వేను ఆపకుంటే మాత్రం కష్టమే. అందులోనూ బ్యాటింగ్ కు బాగా సహకరించే భారత పిచ్ లపై కాన్వే కుదురుకుంటే ఆపడం బ్రహ్మతరం కూడా కాదు. నిన్నటి ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కాన్వే స్లాగ్ స్వీప్ తో కొట్టిన 89 మీటర్ల భారీ సిక్సర్ ను చూశాక ఎవరైనా ఈ మాటను ఒప్పుకొంటారు.