Begin typing your search above and press return to search.

చెన్నై కొంప ముంచిన ధోనీ భారీ సిక్సర్

ఎంఎస్ ధోనీ...టీమిండియా ఆల్ టైం గ్రేట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న క్రికెటర్.

By:  Tupaki Desk   |   20 May 2024 3:54 AM GMT
చెన్నై కొంప ముంచిన ధోనీ భారీ సిక్సర్
X

ఎంఎస్ ధోనీ...టీమిండియా ఆల్ టైం గ్రేట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. చివరి ఓవర్ చివరి బంతి వరకు ధోనీ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టుకు గెలుపుపై పెద్దగా ఆశలుండవు. లాస్ట్ ఓవర్..లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించగల సత్తా ధోనీ సొంతం. నిన్న చెన్నైతో మ్యాచ్ చివరి ఓవర్లో ధోనీ క్రీజులో ఉండడంతో ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ చేజారింది అనుకుంది. ఆర్సీబీ భయపడినట్లుగానే చివరి ఓవర్ తొలి బంతిని ధోనీ సిక్సర్ గా మలిచడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ గుండె బద్దలైంది. కట్ చేస్తే..ధోనీ కొట్టిన ఆ సిక్స్ ఆర్సీబీనీ మ్యాచ్ గెలిపించింది. ధోనీ సిక్స్ కొడితే చెన్నై ఓడి ఆర్సీబీ ఎలా గెలిచింది అనుకుంటున్నారా?

ధోనీ కొట్టిన సిక్సర్ తో ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకుంది. ఎందుకంటే, చెన్నై ప్లే ఆఫ్స్ కు 6 బంతుల్లో 17 కావాల్సిన తరుణంలో ధోనీ సిక్స్ కొట్టాడు. అంటే, మిగిలిన 5 బంతుల్లో 11 పరుగులు...ధోనీ స్ట్రైక్ లో ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ గెలవకపోయినా...5 బంతుల్లో 11 పరుగులు కొట్టి చెన్నైని ప్లే ఆఫ్స్ కు తీసుకువెళ్లడం ధోనీకి బ్యాటుతో పెట్టిన విద్య అనుకున్న చెన్నై ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ధోనీ కొట్టిన సిక్సర్ తమ జట్టు పాలిట శాపంగా మారుతుందని వారు గ్రహించే సరికి ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది.

చివరి ఓవర్లో యష్ దయాల్ లెగ్ స్టంప్ పై లో ఫుల్ టాస్ గా వేసిన తొలి బంతిని ధోనీ ఫైన్ లెగ్ మీదుగా స్టాండ్స్ లోకి పంపి 6 పరుగులు సాధించాడు. ఏకంగా 100 మీటర్ల సిక్సర్ బాదడంతో బంతి స్టేడియం బయట పడింది. ఇదే చెన్నై పాలిట శాపంగా మారింది. ఆ పాత బంతి స్థానంలో అంపైర్లు మరో బాల్ ను తీసుకున్నారు. అయితే, అప్పటిదాకా మైదానంలో వర్షం వల్ల బంతి తడిసి బౌలర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. కానీ, బాక్సులో నుండి కొత్త బంతి తీసివ్వడంతో బౌలర్ యష్ బాల్ ను గ్రిప్ చేయడం సులువైంది. ఇంకేముంది, యష్ వేసిన రెండో బంతికి ధోనీ అవుటయ్యాడు. చివరి 4 బంతుల్లో యష్ కేవలం ఒక్క పరుగే ఇవ్వడంతో ఆర్సీబీ గెలిచింది.

దీంతో, మ్యాచ్ పూర్తవగానే సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయం గురించి చర్చ మొదలెట్టారు. ధోనీ వల్లే ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందంటూ కామెంట్లు పెట్టారు. ఇక, ఇదే విషయాన్ని ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా డ్రెస్సింగ్ రూంలో తన సహచర ఆటగాళ్లతో చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. ధోనీ స్టేడియం బయటకు సిక్స్ కొట్టడం వల్ల ఆర్సీబీకి మంచి జరిగిందని, ఆ షాట్ వల్ల తడవని, బౌలింగ్ కు అనుకూలమైన కొత్త బంతి లభించిందని దినేష్ కార్తీక్ చెబుతున్న మాటలు వైరల్ గా మారాయి. అలా, ఆర్సీబీని ధోనీ గెలిపించి ప్లే ఆఫ్స్ కు చేర్చాడన్న మాట!