భారత్ విశ్వవిజేత... ధోనీ రియాక్షన్ సూపర్!
టీ20 ప్రపంచ కప్ - 2024 ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
By: Tupaki Desk | 30 Jun 2024 4:31 AM GMTభారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్... ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు టోర్నీలో విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ - 2024 ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇది భారత క్రికెట్ అభిమానులకు ఒక చిరస్మరణీయ విజయం. ఈ సందర్భంగా ధోనీ రియాక్షన్ వైరల్ గా మారింది.
అవును... శనివారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఎన్నో ట్విస్టులు, మరెన్నో జలక్కులు, నరాలు తెగే ఉత్కంఠ అనంతరం ఒక చరిత్ర ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా... తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా... 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రోహిత్ చెప్పినట్లుగానే విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో బ్యాట్ కు పని చెప్పాడు.
ఇందులో భాగంగా.. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 76 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో... అక్షర్ పటేల్ (47: 31 బంతుల్లో 1×4, 4×6), శివం దుబె (27: 16 బంతుల్లో 3×4, 1×6) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. వాస్తవానికి 176 పరుగులు పెద్ద స్కోరే అనిపించినా.. ఇటీవల ఐపీఎల్ చూసిన తర్వాత ఆ అభిప్రాయాలు మాగ్జిమం మారిపోయే పరిస్థితి.
అనుకున్నట్లుగానే ఛేజింగ్ కి దిగిన సఫారీ బ్యాటర్లు బాదుడు మొదలుపెట్టారు. ఇంకా రెండు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే పని పూర్తి చేస్తారనే భావన కలిగించారు. వీరిలో హెన్రిచ్ క్లాసెన్ (52: 27 బంతుల్లో 2×4, 5×6) టెన్షన్ పుట్టించగా.. డికాక్ (39: 31 బంతుల్లో 4×1, 1×6) రాణించారు. అయినప్పటికీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులే చేయగలిగింది.
భారత్ బౌలర్లలో బుమ్రా (2/18), హార్దిక్ పాండ్య (3/20), అర్ష్ దీప్ సింగ్ (2/20) అద్భుత బౌలింగ్ తో జట్టును గెలిపించారు.
ధోనీ రియాక్షన్ వైరల్!:
తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించిన అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. ఇందులో భాగంగా... "2024 వరల్డ్ కప్ ఛాంపియన్స్" అని సంభోదిస్తూ... ఈ మ్యాచ్ సమయంలో తన హార్ట్ రేట్ పెరిగిపోయిందని తెలిపాడు. కుర్రాళ్లు మంచి ఫలితం రాబట్టడం అద్భుతమని కొనియాడారు.
ఇదే సమయంలో... వరల్డ్ కప్ ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతీ భారతీయుడూ గర్వంగా ఫీలవుతాడని తెలిపాడు. అదే విధంగా... తన బర్త్ డే సందర్భంగా విలువ కట్టలేని బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపాడు. అనంతరం... "కంగ్రాట్స్ బాయ్స్" అని ధోనీ తన రియాక్షన్ తెలిపాడు.
కాగా... ధోనీ కెప్టెన్సీలో 2007 టీ 20 ప్రపంచ కప్ ను భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ సుమారు 17 ఏళ్ల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్ ను సాధించింది.