వరుసగా 4 సెంచరీలు.. టీమ్ ఇండియాలోకి వచ్చేస్తున్నాడు 'అభిమన్యుడు'
అతడి పేరు అభిమన్యు ఈశ్వరన్.. వినడానికి తమిళనాడు పేరులా ఉంది.
By: Tupaki Desk | 15 Oct 2024 9:30 PM GMTమహా భారతంలో అభిమన్యుడులాగా ఈ అభిమన్యుడూ గొప్ప ప్రతిభావంతుడే.. ఆ అభిమన్యుడు కురుక్షేత్రంలోని పద్మవ్యూహంలో చిక్కుకుపోతే.. ఈ అభిమన్యుడు టీమ్ ఇండియా పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోతున్నాడు. అయితే, ఇప్పుడు కాలం కలిసివచ్చింది.. పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టే సమయం వచ్చింది. 157 నాటౌట్.. 116, 191, 127 నాటౌట్.. ఇవీ అతడి గత నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో చేసిన స్కోర్లు. ఈ స్కోర్లు చూస్తేనే చెప్పొచ్చు అతడు ఎంతటి ఫామ్ లో ఉన్నాడో..? కానీ, టీమ్ ఇండియాలోకి మాత్రం అవకాశం కష్టమే అవుతోంది.
ప్రతిభ ఉంది.. కూర్పులో చోటు కష్టం
అతడి పేరు అభిమన్యు ఈశ్వరన్.. వినడానికి తమిళనాడు పేరులా ఉంది. కానీ, అతడు పుట్టింది ఉత్తరాఖండ్ లో.. దేశవాళీ క్రికెట్ లో ఆడేది పశ్చిమ బెంగాల్ కు. ఇక 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ క్రికెట్ కెరీర్ కూడా ఇలాగే భిన్నంగా సాగుతోంది. సెంచరీల మీద సెంచరీలు.. వేలకొద్దీ పరుగులు చేసినా అభిమన్యుకు టీమ్ ఇండియాలోకి రావడం కష్టం అవుతోంది. దీనికి కారణం రోహిత్ శర్మ జట్టు కూర్పు. స్వయంగా రోహిత్ టెస్టుల్లోనూ ఓపెనర్ గా వస్తుండడం, మరో ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ స్థిరపడడంతో అభిమన్యుకు చాన్స్ లు రావడం లేదు. గతంలో మయాంక్ అగర్వాల్, ప్రథ్వీషా వంటి వారితో పోటీ ఉండడంతోనూ అభిమన్యుకు జాతీయ జట్టులోకి పిలుపురాలేదు.
సెంచరీలే సెంచరీలు..
అభిమన్యు ఈ సీజన్ లో చెలరేగి ఆడుతున్నాడు. వరుసగా నాలుగు సెంచరీలు బాదాడు. రంజీ ట్రోఫీ లో యూపీతో లక్నోలో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగాడు. 172 బంతుల్లో 127 పరుగులు సాధించాడు. ఇప్పటికే దేశవాళీల్లో 27 సెంచరీలు కొట్టాడు. రంజీలకు ముందు దులీప్ ట్రోఫీ లో రెండు శతకాలు బాదాడు. తర్వాత ఇరానీ కప్ లోనూ మూడంకెలు అందుకున్నాడు. భారత్ ‘ఎ’ తరఫున గతంలో మంచి ప్రదర్శన చేశాడు. గతంలో ఓసారి బ్యాకప్ ఓపెనర్ గా ఎంపికైనా.. తుదిజట్టులో చోటు దక్కలేదు.
ఆస్ట్రేలియా సిరీస్ కు ఖాయం..
ఇంత అద్భుతంగా ఆడుతున్న అభిమన్యుకు ఇప్పుడు వయసు 29. ఇంతవరకు జాతీయ జట్టులోకి రాలేకపోయిన అతడికి వచ్చే నవంబరు నుంచి జరిగే ఆస్ట్రేలియా టూర్ లో కచ్చితంగా అవకాశం దక్కనుంది. ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో ఫామ్ దృష్ట్యా ఈసారి అభిమన్యుకు పిలుపు రావొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ తో పోటీ ఉన్నప్పటికీ అభిమన్యు వైపే సెలక్టర్లు మొగ్గు చూపొచ్చు.