Begin typing your search above and press return to search.

స్కోర్ కార్డు లేకుండా హైదరాబాద్ లో మ్యాచ్!

ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినా కనీస సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరు

By:  Tupaki Desk   |   7 Oct 2023 9:39 AM GMT
స్కోర్ కార్డు లేకుండా హైదరాబాద్ లో మ్యాచ్!
X

భారత్ లో వన్డే ప్రపంచ కప్ వివిధ రూపాలుగా ప్రత్యేకంగా నిలవనుంది. ఓటీటీలు పెరిగాక జరుగుతున్న ఈ టోర్నీకి భారత్ వంటి పెద్ద దేశం ఆతిథ్యం ఇస్తుండడం విశేష సంఖ్యలో అభిమానులు వీక్షించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ కప్ అధికారిక డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీ హాట్‌స్టార్‌. భారీ మొత్తం వెచ్చించి ఈ హక్కులను దక్కించుకుంది ఆ సంస్థ. అయితే, నిర్వహణ పరంగా డిస్నీ హాట్ స్టార్ తీరు మాత్రం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. రూ.కోట్లను సంపాదిస్తున్న హాట్ స్టార్.. నాణ్యమైన కంటెంట్ అందించలేకపోతోందని మండిపడుతున్నారు. ఇంతకూ కారణం ఏమంటే.. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్కోర్ కార్డు లేకుండా మ్యాచ్‌ను ప్రసారం చేసింది డిస్నీ హాట్ స్టార్. దీనిపై అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

తొలి రోజు అలా.. రెండో రోజు ఇలా..

ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినా కనీస సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరు. ఇక రెండో మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగింది. అయితే, ఇందులో సాంకేతిక లోపం బయటపడడంతో అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. శుక్రవారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ లో స్టార్ స్పోర్ట్స్ డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పాక్ బ్యాటింగ్ సందర్బంగా 20 నిమిషాల పాటు ఐసీసీ లోగోతో పాటు స్కోర్ కార్డులన్నీ మాయమయ్యాయి. కేవలం ఆట మాత్రమే కనిపించింది.

లోగో, వీక్షకులు కనిపించారు కదా?

అంతరాయం సమయంలో హాట్ స్టార్ లోగో.. వ్యూయర్స్ సంఖ్య కనిపించడం గమనార్హం. అయితే స్క్రీన్‌పై మరే అక్షరం కూడా లేదు. ఇది చూసి వీక్షకులే కాదు.. ప్రేక్షకులు, కామెంటేటర్లూ అవాక్కయ్యారు. అయితే, దీనిపై పాక్ మాజీ ఓపెనర్ రమీజ్ రజా వ్యంగ్యంగా స్పందించాడు. తమ జట్టు మూడు వికెట్లు కోల్పోయి ఉండడాన్ని పురస్కరించుకుని.. పాక్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఉన్నట్లే హాట్‌ స్టార్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుందని వ్యాఖ్యానించాడు.

అమ్మేసుకుంటోందా?

వాల్ట్‌ డిస్నీ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సంస్థ. అయితే, భారత్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18 మీడియాకు కోల్పోయింది. దీంతో డిస్నీ+ హాట్‌స్టార్‌కు చందాదారులు భారీగా తగ్గారు. దీంతోనే భారత మార్కెట్ లో స్ట్రీమింగ్‌, టెలివిజన్‌ వ్యాపారాలను విక్రయించడానికి చూస్తోంది. ఇందుకోసం గౌతమ్‌ అదానీ, కళానిధి మారన్‌ (సన్‌ టీవీ) సహా ఆసక్తి-స్థోమత కలిగిన పెట్టుబడిదార్లతో ప్రాథమిక చర్చలు జరుపుతోంది. కాగా, మారన్‌ కు చెందిన సన్‌ టీవీ నెట్‌ వర్క్‌, అదానీ గ్రూప్‌ సంస్థ ఎన్డీ టీవీ కూడా డిస్నీ ఆస్తుల కొనుగోలుకు చూస్తున్నాయి. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఎటువంటి ఒప్పందాలు జరగలేదని చెబుతున్నారు. డిస్నీ భారత ఆస్తులను కొనుగోలు చేయడానికి పలు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలూ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

భారత కార్యకలాపాల్లో భాగాన్ని లేదా డిస్నీ+ హాట్‌స్టార్‌, స్పోర్ట్స్‌ హక్కులతో పాటు భారత ఆస్తులను విక్రయించడానికి డిస్నీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో కూడా ఇప్పటికే డిస్నీ సంప్రదింపులు జరిపింది. పూర్తిగా భారత వ్యాపారాన్ని విక్రయించడం లేదా సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం వంటి వ్యూహాత్మక అవకాశాలను డిస్నీ పరిశీలిస్తోంది.