ఇండియా – కివీస్ మ్యాచ్ లోక్రికెటర్స్ తో పాటు మరో 'స్టార్' రికార్డ్!
తాజా వన్ డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ లో ఇండియా - న్యూజిలాండ్ టీం ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా నడిచిందనేది తెలిసిన విషయమే
By: Tupaki Desk | 16 Nov 2023 5:36 AM GMTతాజా వన్ డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్ లో ఇండియా - న్యూజిలాండ్ టీం ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంత రసవత్తరంగా నడిచిందనేది తెలిసిన విషయమే. వార్ వన్ సైడ్ అని పలువురు టీం ఇండియా అభిమానులు భావించినప్పటికీ... అలాంటి అవకాశం లేకుండా మూడో వికెట్ పడే వరకూ పూర్తిస్థాయిలో టెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో నెలకొన్న రికార్డులతో పాటు మరో స్టార్ సృష్టించిన రికార్డ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అవును... ముంబైలోని వాంఖడే స్టేడియంలో బ్యాట్ తో విరాట్ కోహ్లీ, బంతితో మహమ్మద్ షమీ తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కొహ్లీ షాట్స్ తో షమీ స్వింగ్స్ తో హోరెత్తించేశారు. ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు 10 రోజుల్లో డిస్నీ హాట్ స్టార్ తన పేరిట సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ఈ మ్యాచ్ లో సాధించిన రికార్డు కారణంగా డిస్నీ హాట్ స్టార్ సుమారు రూ.41 వేల కోట్ల లాభాలను ఆర్జించింది!
డిస్నీ + హాట్ స్టార్ నవంబర్ 15న గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్ వీక్షకుల రికార్డును నెలకొల్పింది. 10 రోజుల క్రితం ఇండియా - సౌతాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ రెండు మ్యాచ్ లలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. నవంబర్ 5న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ సాధించగా తాజా మ్యాచ్ లో 50వ సెంచరీ సాధించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ సరసన చేరే సెంచరీ కోసం టీ ఇండియా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూశారో తెలిసిందే. అది సాధించిన రోజు డిస్నీ హాట్ స్టార్ రికార్డ్ నెలకొల్పగా... తిరిగి పదిరోజులు తర్వాత తాజాగా వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై తన 50వ సెంచరీని సాధించాడు విరాట్. దీంతో సచిన్ రికార్డ్ ను చెరిపేశాడు!
ఈ క్రమంలో లీగ్ లో విరాట్ 49వ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికాతో సాగిన మ్యాచ్ లో డిస్నీ+ హాట్ స్టార్ లో వీక్షకుల సంఖ్య 4.4 కోట్లు కాగా... తాజాగా కివీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య 5.3 కోట్లకు చేరుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రికార్డు బద్దలై.. సరికొత్త రికార్డు నమోదైంది. ఫలితంగా బుధవారం డిస్నీ + హాట్ స్టార్ షేరు 3 శాతానికి పైగా లాభంతో ముగిసింది.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. ఈ కంపెనీ షేర్లు 3.14 శాతం పెరుగుదలతో 93.93 డాలర్ల వద్ద ముగిశాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి డిస్నీ షేర్లు 19 శాతానికి పైగా పెరిగాయి. డిస్నీ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా పెరిగింది.
ఫలితంగా... న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బుధవారం ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ 167.289 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ కంపెనీ రూ.41 వేల కోట్లకు పైగా లాభం ఆర్జించిందన్నమాట!