Begin typing your search above and press return to search.

ఆనంద్ వారసుడొచ్చాడు..18 ఏళ్లకే చెస్ ప్రపంచ చెస్ చాంపియన్..

2024 పోతూ పోతూ భారత క్రీడా రంగానికి అద్భుతమైన బహుమతి ఇచ్చింది. ఎంతోకాలంగా సాధ్యం కాని.. రికార్డును అందించింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 1:47 PM GMT
ఆనంద్ వారసుడొచ్చాడు..18 ఏళ్లకే చెస్ ప్రపంచ చెస్ చాంపియన్..
X

2024 పోతూ పోతూ భారత క్రీడా రంగానికి అద్భుతమైన బహుమతి ఇచ్చింది. ఎంతోకాలంగా సాధ్యం కాని.. రికార్డును అందించింది. ప్రపంచ చదరంగంలో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మరో చాంపియన్ ఎప్పుడొస్తాడా? అని ఎదురుచూసిన అభిమానులకు ఆ లోటు తీరింది. అంతేకాదు.. భవిష్యత్ చెస్ ధ్రువతార తానేనని చాటుతూ 18 ఏళ్ల యువకుడు దూసుకొచ్చాడు.

వచ్చేశాడు మొనగాడు..

భారత్ కు చెందిన దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచాడు. అది కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)ను ఓడించి మరీ. 14 రౌండ్ల పాటు జరిగిన ఈ చాంపియన్ షిప్ లో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో లిరెన్ ను మట్టికరిపించాడు. దీంతో గుకేశ్ 18 ఏళ్ల అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన ఘనతను అందుకున్నాడు.

ఆనంద్ తర్వాత ఇతడే..

కోనేరు హంపి, పెంట్యేల హరిక్రిష్ణ, ద్రోణవల్లి హారిక తదితర ప్రతిభావంతులైన ఆటగాళ్లకు సాధ్యం కాని దానిని 18 ఏళ్ల గుకేశ్ సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చాంపియన్ అయిన భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు.. అత్యంత చిన్న వయసులో ప్రపంచ చాంపియన్ అయిన ఆటగాడు కూడా ఇతడే. దీంతో అత్యంత అరుదైన ఘనతను అందుకున్నాడు.

14 రౌండ్ల పాటు..

ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ 14 రౌండ్ల పాటు సాగింది. గురువారం చివరి రౌండ్‌ జరిగింది. 13 రౌండ్ల అనంతరం గుకేశ్, లిరెన్‌ 6.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. గురువారం చివరి క్లాసికల్‌ గేమ్‌ లో గుకేశ్‌ గెలిచాడు. దీంతో ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు. ఒకవేళ ఈ గేమ్‌ డ్రాగా ముగిసి ఉంటే గుకేశ్, లిరెన్ 7-7తో సమంగా ఉండేవారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు తక్కువ కాల వ్యవధి కలిగిన గేమ్‌ ల టైబ్రేక్‌ నిర్వహించాల్సి వచ్చేది. అయితే, ఆ అవకాశం లేకుండా గుకేశ్ టైటిల్ కొట్టేశాడు.