చెస్ ప్రపంచ చాంపియన గుకేశ్.. చెన్నైలో స్థిరపడ్డ తూర్పుగోదావరి బిడ్డ
ప్రపంచ చదరంగంలో సరికొత్త శకం మొదలైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి మరో ప్రపంచ చాంపియన్ ఎప్పుడా? అనే ఎదురుచూపులకు తెరపడింది
By: Tupaki Desk | 12 Dec 2024 5:23 PM GMTప్రపంచ చదరంగంలో సరికొత్త శకం మొదలైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి మరో ప్రపంచ చాంపియన్ ఎప్పుడా? అనే ఎదురుచూపులకు తెరపడింది. అది కూడా కేవలం 18 ఏళ్ల యువకుడితో సాధ్యమైంది.. ఆ కుర్రాడే గుకేశ్ దొమ్మరాజు. అన్నిటికంటే ముఖ్యమైనది అతడు తెలుగోడు..
తండ్రి డాక్టర్..
చెస్ ప్రపంచంలో ఇప్పుడు గుకేశ్ దొమ్మరాజు పేరు మార్మోగుతోంది. దీంతో ఇతడు ఎవరా? అని వెదికితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారి కుమారుడని తెలిసింది. గుకేశ్ 2006 మే 29న పుట్టాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం వీరింది. గుకేశ్ తల్లిదండ్రులు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. గుకేష్ తండ్రి, రజనీకాంత్ సర్జన్ కాగా తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్.
11 ఏళ్లలో ప్రపంచ చాంపియన్..
గుకేశ్ కు ఏడేళ్ల వయసు ఉన్నప్పడు చెస్ ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 11 ఏళ్లలోనే అతడు ప్రపంచ చాంపియన్ అయ్యాడు. 2015లో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్ లో అండర్-9 విభాగంలో, 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ అండర్ 12 విభాగంలో విజేతగా నిలిచాడు. 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లలో ఐదు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. గుకేశ్ 2019 జనవరి 15న గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పటికి అతడికి 12 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. అప్పటికి చరిత్రలో రెండో అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్. సెర్గీ కర్జాకిన్ ను అధిగమించిన గుకేశ్ నెలకొల్పిన ఈ రికార్డు 17 రోజులే నిలిచింది. అభిమన్యు మిశ్రా దీనిని బద్దలు కొట్టాడు. అయితే, తాజాగా గుకేశ్ ప్రపంచ చాంపియన్ గానూ నిలిచి చరిత్రకెక్కాడు. బహుశా దీనిని ఎవరూ బద్దలుకొట్టలేరు.