పేరులో క్లాస్, బ్యాటింగ్ ఊరమాస్.. క్లాసెన్ గురించి ఈ విషయాలు తెలుసా?
2023 సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ మ్యాచ్ లంటే
By: Tupaki Desk | 29 March 2024 9:27 AM GMTచాలాకాలం తర్వత ఐపీఎల్ లో హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. 2023 సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ మ్యాచ్ లంటే... టీవీలో మ్యాచ్ చూసేవారు సైతం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదన్న అతిశయోక్తి కాదేమో! అయితే అప్పటిలెక్క వేరు.. ఈ సీజన్ లెక్క వేరు!
అవును... మారాయి... అన్నీ మారాయ్! ఫోర్ చూడాలంటే పక్క టీం బ్యాటర్ వైపు, సిక్స్ కనాలంటే ప్రత్యర్థి టీం హిట్టర్ వైపు చూసే రోజులు పోయాయ్! టీం మారింది.. జెర్సీ మారింది.. కెప్టెన్ మారాడు..! అవన్నీ ఒకెత్తు అయితే... హెన్రిచ్ క్లాసెన్ మారాడు..! ప్రత్యర్థి బౌలర్లను మడతపెట్టేస్తున్నాడు..! అనే సంభాషణ ఇప్పుడు సగటు హైదరాబాద్ టీం ఫ్యాన్స్ మధ్య నడుస్తుంది!
దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. పేరులో క్లాస్ నింపుకుని మైదానంలో మాస్ హిట్టింగ్ చేస్తున్న హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!! ఈ సీజన్లోని కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను గెలుపు అంచులవరకూ తీసుకెళ్లిన క్లాసెన్... ఆ మ్యాచ్ లో 29 బంతుల్లో 8 సికర్ల సాయంతో 63 పరుగులు చేసి.. తాను వచ్చాననే సంకేతాలు ప్రత్యర్థులకు పంపించాడు.
అనంతరం ముంబై ఇండియన్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో మరింతగా చెలరేగిపోయాడు. ఇందులో భాగంగా... 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఉండగా.. 7 సిక్స్ లు ఉన్నాయి. కోల్ కతా పై స్ట్రైక్ రేటు 217 కాగా... ముంబై పై అది కాస్తా 235కి చేరింది! బంతి పడటం ఆలస్యం... స్టేడియంలోని ప్రేక్షకుల కళ్లతో పాటు కెమెరాల కళ్లు బౌండరీ వైపు మళ్లేవి అన్నా అతిశయోక్తి కాదు!
ఐపీఎల్ కెరీర్ ఆరంభం పేలవం!:
వాస్తవానికి క్లాసెన్ ఐపీఎల్ ఎంట్రీ 2018లోనే జరిగింది. నాడు రాజస్థాన్ రాయల్స్ క్లాసెన్ ని రూ.50 లక్షలు పెట్టి దక్కించుకుంది. ఆ సీజన్ లో 4 మ్యాచ్ లు ఆడిన క్లాసెన్ 57 పరుగులు మాత్రమే చేశాడు. 2019 లో బెంగళూరు దక్కించుకుంది. అక్కడా 3 మ్యాచ్ లలో 9 పరుగులతో అత్యంత పూర్ పెర్ఫార్మెన్సే! ఈ నేపథ్యంలో తర్వాత కరోనా రావడంతో పాటు క్లాసెన్ ని ఏ ప్రాంఛైజీ కూడా పరిగణలోకి తీసుకోలేదు!
ఈ సమయంలో 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు క్లాసెన్! ఆ సీజన్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 52 బంతుల్లో సెంచరీ చేయడంతో... ఒక్క సారిగా అన్ని ప్రాంఛైజీల దృష్టి క్లాసెన్ పై పడింది. ఆ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్ లు ఆడిన క్లాసెన్ 448 పరుగులతో సన్ రైజర్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
2024లో విశ్వరూపం!:
ఈ దశలో తాజా సీజన్ కోసం మరోసారి క్లాసెన్ పై కన్నేసింది సన్ రైజర్స్! ఇందులో భాగంగా... రూ.5.25 కోట్లు పెట్టి క్లాసెన్ ని దక్కించుకుంది. ఈ సమయంలో అతడిని ఇంతడబ్బా అన్నవాళ్లూ లేకపోలేదు! అయితే నవ్విన నాపచేనే పండుతుందన్నట్లుగా.. తనను తక్కువ చేసి చూసినవాళ్లకు బ్యాట్ తో సమాధానం చెబుతున్నాడు. బౌలర్ ఎవరనేది క్లాసెన్ కి ఏమాత్రం సంబంధం లేదు... బంతి బౌండరీ దాటిందా లేదా అన్నదే టార్గెట్!
మరి ఈ సీజన్ లో ఇప్పటికే ప్రత్యర్థి టీం లకు చెప్పాల్సిన విషయాన్ని సుస్పష్టంగా చెప్పేసిన క్లాసెన్... మిగిలిన మ్యాచ్ లలో ఇంకెలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడనేది వేచి చూడాలి! ఇంకెలాంటి రికార్డులు నమోదవుతాయనేది చూడాలి! ఇదే ఫాం కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ కప్పు ఎత్తడం ఖాయం!