ద్రవిడ్ మెచ్చిన హెదరాబాద్ మల్కాజ్ గిరి ఫీల్డింగ్ కోచ్
వన్డే ప్రపంచ కప్ లో అందరినీ ఆకర్షించిన అంశం.. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ‘‘బెస్ట్ ఫీల్డర్’’ అవార్డు ప్రదానోత్సవం. ఆ మ్యాచ్ లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసినవారికి దీనిని ప్రదానం చేసేవారు.
By: Tupaki Desk | 22 Nov 2023 1:30 AM GMTవన్డే ప్రపంచ కప్ లో అందరినీ ఆకర్షించిన అంశం.. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ‘‘బెస్ట్ ఫీల్డర్’’ అవార్డు ప్రదానోత్సవం. ఆ మ్యాచ్ లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసినవారికి దీనిని ప్రదానం చేసేవారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను సమావేశపరిచి.. ఆ ఫీల్డర్ ప్రదర్శనను కొనియాడుతూ.. అతడి వల్ల జట్టుకు ఒనగూరిన ప్రయోజనాన్ని వివరిస్తూ, వారికి ఓ మెడల్ ను మెడలో వేసేవారు. చిన్న స్పీచ్ ఇచ్చేవారు. వాస్తవానికి ఇదొక మంచి సంప్రదాయం. జట్టు సభ్యులను ఉత్సాహపరిచేది. స్ఫూర్తి కూడా నింపుతుంది. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఈ మేరకు వీడియోలను విడుదల చేసేంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మన ఫీల్డింగ్ మెరుగు..
ప్రపంచ కప్ లో భారత జట్టు ఫీల్డింగ్ బాగుంది. సొంత మైదానలు అనండి.. ఇంకేమైనా చెప్పండి.. మిగతా జట్లతో పోలిస్తే టీమిండియా ఫీల్డింగ్ చక్కగా సాగింది. కొన్నేళ్ల నుంచి ఫిట్ నెస్ ప్రమాణాలు పెరగడంతో ఫీల్డింగ్ అందుకుతగినట్లుగానే ఉంటోంది. ఇక తాజా విషయానికొస్తే మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో అత్యుత్తమ ఫీల్డర్ ప్రకటన సందర్భంగా స్ఫూర్తిమంతమైన మాటలతో.. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతూ ఓ వ్యక్తి కనిపించాడు. అతడెవరో కాదు.. మన హైదరాబాదీనే. మల్కాజ్ గిరి చెందిన దిలీప్. టీమిండియా ఫీల్డింగ్ కోచ్.
క్రికెటర్ గా మిస్ అయి..
దిలీప్ ది సాధారణ కుటుంబ నేపథ్యం. హైదరాబాద్ అండర్-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. పాఠశాల పిల్లలకు లెక్కలు ట్యూషన్లు చెబుతూ క్రికెట్ ఆడాడు. హెచ్‌సీఏ లీగ్స్‌లో క్లబ్ క్రికెట్ కొనసాగించాడు. ఐపీఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ కు సహాయక ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లెవెల్-1, లెవల్-2 కోచ్ గా శిక్షణ పూర్తిచేశాడు. లెవెల్-3 శిక్షణలో జాతీయ స్థాయిలో టాపర్ దిలీపే. ఇదే సర్టిఫికెట్ తో భారత అండర్ -19, మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, ఇండియా-ఎ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా వెళ్లడం అతడి కెరీర్ లో మలుపు.
ద్రవిడ్ మార్గదర్శకత్వంలో..
దిలీప్ ఇండియా-ఎ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నప్పుడు ఆ జట్టుకు క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వచ్చాడు. అక్కడే దిలీప్ క్రమశిక్షణ, పనితీరు ద్రవిడ్ ను బాగా ఆకట్టుకుంది. మరోవైపు రెండేళ్ల కిందట ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ గా వెళ్లాడు. పట్టుబట్టి మరీ.. దిలీప్ ను పిలిపించుకున్నాడు. వాస్తవనికి జాతీయ క్రికెట్ అకాడమీలో అప్పటికే సీనియర్ ఫీల్డింగ్ కోచ్ లు ఉన్నారు. వారిని తీసుకోవాలంటూ బీసీసీఐ పెద్దల నుంచి సిఫార్సులు కూడా వచ్చాయి. కానీ, ద్రవిడ్ మాత్రం దిలీప్ పైనే నమ్మకం కనబర్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు దిలీప్. ఇక తుది సమరంలో టీమిండియా ఓడిపోయాక.. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆటగాళ్లను ఓదారుస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు కోహ్లికి పతకం అందించాడు దిలీప్.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.