Begin typing your search above and press return to search.

147 ఏళ్లు.. 5 లక్షల రన్స్.. చరిత్రలో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ రికార్డు

క్రికెట్ అంటే టెస్టు క్రికెటే.. మధ్యలో వన్డేలు వచ్చినా.. ఇప్పుడు టి20ల యుగం నడుస్తున్నా.. సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో రాణించిన ఆటగాళ్లే చరిత్రలో నిలిచిపోతారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 11:30 AM GMT
147 ఏళ్లు.. 5 లక్షల రన్స్.. చరిత్రలో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ రికార్డు
X

క్రికెట్ అంటే టెస్టు క్రికెటే.. మధ్యలో వన్డేలు వచ్చినా.. ఇప్పుడు టి20ల యుగం నడుస్తున్నా.. సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టుల్లో రాణించిన ఆటగాళ్లే చరిత్రలో నిలిచిపోతారు. ఇక క్రికెట్ కు పుట్టిల్లు ఇంగ్లండ్ అనే సంగతి తెలిసిందే. అసలు బ్రిటిష్ వాళ్లు పాలించిన దేశాల్లోనే క్రికెట్ ఉంది. మిగతా దేశాల్లో అంతంతమాత్రమే.

నెమ్మదైన టెస్టు నుంచి బజ్ బాల్

టెస్టులు, వన్డేలు, టి20లు అన్నిట్లోనూ ఇంగ్లండ్ అనేక ప్రయోగాలు చేసింది. టెస్టులను నిదానంగా ఆడాలన్నా పద్ధతిని బద్దలుకొట్టింది. బజ్ బాల్ అంటూ నాలుగైదేళ్లుగా టెస్టులను వన్డేలా తరహాలో ఆడుతోంది. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. ఒక్క రోజులో 400 పరుగులను అలవోకగా సాధిస్తోంది.

5 లక్షల పరుగులు కొట్టేసింది

టెస్టు క్రికెట్‌ లో తాజాగా ఇంగ్లండ్‌ అరుదైన రికార్డు అందుకుంది. ఈ ఫార్మాట్‌ లో ఐదు లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటికి టెస్టు క్రికెట్ మొదలై 147 ఏళ్లు. అదికూడా తొలి మ్యాచ్ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్యనే జరిగింది. మొత్తమ్మీద ఇంగ్లండ్ 1,081 టెస్టులు ఆడింది. 1082వ టెస్టును న్యూజిలాండ్ తో ఆడుతోంది. ఇందులోనే 5 లక్షల మార్క్ ను చేరింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ లో 378/5 స్కోరుతో ఉంది. ఏకంగా 533 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ లో న్యూజిలాండ్‌ ను 125కే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. దీంతోపాటు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ హారీ బ్రూక్ వరుసగా రెండో సెంచరీ కొట్టాడు. కాగా, ఇప్పటికే ఈ మూడు టెస్టుల సిరీస్‌ లో తొలి మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ గెలిచింది.

టెస్టుల్లో ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఆడిన ఆస్ట్రేలియా ఇంకా 70 వేల పరుగుల వెనుకే ఉంది. ఆస్ట్రేలియా 4,28,868 పరుగులు చేయగా.. ఇండియా 2,78,751 పరుగులతో ఉంది.