6 బంతుల్లో 6 సిక్సులు.. 600 వికెట్లు.. 6.5 అడుగుల పొడగరి
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్
By: Tupaki Desk | 19 July 2023 8:19 PM GMTఓవర్ లో ఆరుకు ఆరు బంతులను సిక్స్ లు కొట్టించుకుని.. అదీ ప్రపంచ కప్ లో కీలకమైన మ్యాచ్ లో దారుణంగా విఫలమైన పేస్ బౌలర్ కు
ఆ తర్వాత దేశం తరఫున క్రికెట్ కెరీర్ ఉంటుందా..? ఈ మ్యాచ్ తర్వాత కాడా అతడు 16 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడా..? 600 టెస్టు వికెట్లు సాధించగలుగుతాడా..? అసాధ్యం అనిపిస్తోంది కదా..? కానీ ఆ బౌలర్ సాధించాడు..
దారుణ ప్రదర్శన తర్వాతా ఘన కెరీర్
పైన చెప్పుకొన్నదంతా ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి. ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మన్ ఎవరనుకుంటున్నారు టీమిండియా గ్రేట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టి20 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో సెప్టెంబరు 18న జరిగిన ఆ మ్యాచ్ ఇప్పటికీ అభిమానులకు అపురూపమే. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తో యువరాజ్ కు వాదన జరగడం.. ఆ ప్రతాపాన్ని అతడు బ్రాడ్ పై చూపడం.. బంతి ఎక్కడ వేయాలో తెలియక బ్రాడ్ బిత్తరపోవడం ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులకు పదేపదే గుర్తొచ్చే సీన్. నాటి మ్యాచ్ తో బ్రాడ్ కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. ఎవరూ ఊహించనంత ఉజ్వలంగా వెలుగుతోంది.
టాప్ 5 బౌలర్ గా..
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా 600 వికెట్ల ఘనతను అందుకున్నాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు అతడు కేవలం 19 వికెట్ల దూరంలో ఉన్నాడు. రికార్డు స్థాయిలో 166 వ టెస్టు ఆడుతున్న బ్రాడ్.. 20సార్లు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. 28 సార్లు 4 వికెట్లు తీశాడు. కాగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుడు శ్రీలంక ఆఫ్ స్పినర్ ముత్తయ్య మురళీ ధరన్ (800) అన్న సంగతి తెలిసిందే. అతడి తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం దివంగత షేన్ వార్న్ (708) ఉన్నాడు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్ (688) మూడో స్థానంలో అనిల్ కుంబ్ల నాలుగో ప్లేస్ లో కొనసాగుతున్నారు. బ్రాడ్ 5వ స్థానంలోకి వచ్చాడు.
ఆ జంట అద్భుతం..
ఒక బౌలర్ 600 వికెట్లు తీయడమే అద్భుతం అంటే.. అతడి సహచరుడు (అండర్సన్) 688 వికెట్లు తీయడం ఇంకా విశేషం. అందులోనూ ఒకే తరంలో క్రికెట్ ఆడుతూ ఇద్దరూ 600 వికెట్లకు పైగా పడగొట్టడం అంటే మామూలు ఘనత కాదు. మరో గొప్పదనం ఏమిటో తెలుసా.. ప్రపంచ క్రికెట్ లో వెయ్యికి పైగా వికెట్లు పడగొట్టిన బౌలింగ్ ద్వయం వీరిది. అండర్సన్-బ్రాడ్ ఇద్దరూ కలిపి 1033 వికెట్ల తీశారు. వీరిద్దరే ఇందులో టాప్. ఇందులో బ్రాడ్ వి 498 వికెట్లు. కాగా, బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ఇంగ్లండ్ కు ఆడాడు. ఇక స్టువర్ట్ బ్రాడ్ ఎత్తు 6.5 అడుగులు. ప్రపంచ క్రికెటర్లలో పొడగరులలో అతడు ఒకడు. అంటే.. 6 బంతులకు ఆరు సిక్సులు కొట్టించుకున్న 6.5 అడుగుల బౌలర్ 600 వికెట్లు తీశాడన్నమాట.