Begin typing your search above and press return to search.

చాంపియన్.. హాట్ ఫేవరెట్ మళ్లీ ఓడిందోచ్.. ప్రపంచ కప్ నుంచి ఇంటికే?

అందులోనూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గధామం. అలాంటిచోటనే 200 పరుగులు కూడా చేయలేకపోయింది జాస్ బట్లర్ సేన.

By:  Tupaki Desk   |   26 Oct 2023 4:41 PM GMT
చాంపియన్.. హాట్ ఫేవరెట్ మళ్లీ ఓడిందోచ్.. ప్రపంచ కప్ నుంచి ఇంటికే?
X

ఐదారేళ్లుగా భీకరంగా ఆడుతూ.. నాలుగేళ్ల కిందట ప్రపంచ కప్ కొట్టేసిన ఆ జట్టును ఈసారి సెమీఫైనల్లో అయినా చూడలేం. ఆడింది ఐదు మ్యాచ్ లు.. అందులోని నాలుగింటిలో ఓటమి.. అది కూడా దారుణమైన నెట్ రన్ రేట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి జట్టయినా ఇంటి బాట పడుతుందని సగటు అభిమాని కూడా చెబుతాడు. భీకర బ్యాటింగ్ లైనప్.. బీభత్స బౌలింగ్ దాడి.. భయంకరమైన దాడి చేయగల ఆల్ రౌండర్లు.. ఇదంతా చూసి ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే దిగ్గజ క్రికెటర్లు ఆ జట్టును హాట్ ఫేవరెట్ అని చెప్పారు. భారతీయ బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ పండితుడు కూడా అయిన సునీల్ గావస్కర్ సైతం ఆ జట్టుకు ఓటేశాడు. కానీ, అంచనాలు తలకిందులు అవడం క్రికెట్ లో సహజమే.

చాంపియన్ ఇంటి బాట డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ది ఈ ప్రపంచ కప్ లో అత్యంత చెత్త ఆట. పోరాట పటిమ అనేదే లేదు.. మ్యాచ్ గెలవాలన్న కసి లేదు.. పుంజుకుందామన్న పట్టుదల కనిపించలేదు. దీంతో ఆ జట్టు లీగ్ దశలో ఐదు మ్యాచ్ లకు గాను నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 33.2 ఓవర్లే ఆడి 156 పరుగులకే ఆలౌటైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో టాస్ కూడా ఇంగ్లండే గెలిచింది. అందులోనూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గధామం. అలాంటిచోటనే 200 పరుగులు కూడా చేయలేకపోయింది జాస్ బట్లర్ సేన.

అంటే..టాస్ ను, పిచ్ ను తప్పుబట్టడానికి ఏమీ లేదని తెలిసిపోతోంది. అసలు ఒక్క బ్యాట్స్ మన్ కూడా అర్ధ శతకం చేయలేకపోయారంటే వైఫల్యం ఏపాటిదో స్పష్టమైపోతోంది. అందులోనూ గాయం నుంచి సగం కోలుకుని వచ్చిన ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) చేసిన పరుగులే అత్యధికం. ఓపెనర్లు బెయిర్‌ స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. కానీ,ఎక్కువ సేపు నిలవలేదు. మేటి బ్యాట్స్ మన్ రూట్ (3,) కెప్టెన్ బట్లర్ (8), హార్డ్ హిట్టర్ లివింగ్‌ స్టోన్ (1) దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ (15; 15 బంతుల్లో) ఆకట్టుకోలేకపోయాడు. కాగా, లంక బౌలర్లు లాహిరు కుమార 3, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌ 2, రజిత 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.

కోలుకునే చాన్సే లేదు..

ఇంగ్లండ్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ జట్టు పరువు కాపాడుకోవడమే కష్టమే. జట్టు ఫామ్ చూస్తుంటే.. సెమీస్ ఆశల్లేనట్లే. అయితే, మరో నాలుగు మ్యాచ్ లలో కనీసం ఒకటి రెండైనా గెలిచే చాన్సే కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆ జట్టు గెలిచింది బంగ్లాదేశ్ వంటి జట్టు పైనే. న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా మీద పరాజయం పాలైంది. అది కూడా దారుణంగా ఓడింది.

ఇక మిగిలింది భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ లతో మ్యాచ్ లు. భారత్ ఐదుకు ఐదు మ్యాచ్ లలో గెలిచి అద్భుత ఫామ్ లో ఉంది. కంగారూ జట్టు ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ లయ అందుకుంది. పాకిస్థాన్ పెద్ద జట్టే. నెదర్లాండ్స్.. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాను ఓడించింది. వీటిపై నెగ్గాలంటే ఇప్పుడున్న ఇంగ్లండ్ చెమటోడ్చాల్సిందే. అందులోనూ ఘోర వైఫల్యాలతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన దశ నుంచి ఆ జట్టు కోలుకునే చాన్సే లేదు.