ప్చ్.. మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రేక్షకులేరి?
లక్షమందిపైగా పట్టే సామర్థ్యం ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ కు పట్టుమని 20 వేల మందైనా రాలేదు.
By: Tupaki Desk | 5 Oct 2023 11:15 AM GMTఘోర వైఫల్యం అందామంటే.. భారత్ లో జరుగుతున్న ప్రితిష్ఠాత్మక టోర్నీ.. పోనీ ప్చ్.. అని నిట్టూర్చుదామంటే విమర్శించకుండా ఉండలేని పరిస్థితి.. మొత్తానికి ప్రపంచ కప్ తొలి మ్యాచ్ నిర్వహణలో గుజరాత్ క్రికెట్ సంఘం, బీసీసీఐ పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
అతి పెద్ద స్టేడియంలో ఇలానా?
ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ జరుగుతున్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో. అందులోనూ 2011 తర్వాత భారత్ లో జరుగుతున్నది ఈ వన్డే ప్రపంచ కప్. మన దేశం ఒంటి చేత్తో నిర్వహిస్తున్నది. అలాంటి కప్ ఆరంభ వేడుకలను ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నిర్వహించాలి. కానీ.. కెప్టెన్ల కార్యక్రమంతో సరిపెట్టారు. ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉండొచ్చులే.. దీంతోనే సర్దుకుందాం అనుకుంటే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కు ప్రేక్షకులే లేకపోవడం అయ్యో అనిపించేలా చేస్తోంది.
ఆడుతున్నది పెద్ద జట్లే కదా..?
ఇది ప్రపంచ కప్ తొలి మ్యాచ్. ఆడుతున్నది కూడా నెదర్లాండ్స్-అఫ్గానిస్థాన్ వంటి చిన్న జట్లేమీ కాదు. అయినా, మ్యాచ్ కు ప్రేక్షకుల్లేక స్టాండ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనిని సగటు క్రికెట్ అభిమాని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఆరెంజ్ కలర్ స్టాండ్స్ ఖాళీ లక్షమందిపైగా పట్టే సామర్థ్యం ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ కు పట్టుమని 20 వేల మందైనా రాలేదు. కాగా, ఈ స్టేడియంలో స్టాండ్స్ కు ఆరెంజ్ కలర్ వేశారు. ప్రేక్షకులు లేకపోవడంతో ఆ స్టాండ్స్ అన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ఇది అవమానమే..
అతి పెద్ద స్టేడియం.. అందులోనూ దేశ ప్రధాని పేరిట, ఆయన సొంత రాష్ట్రంలో ఉన్న స్టేడియం.. దేశంలో రెండో పెద్ద నాయకుడైన కేంద్ర హోం మంత్రి దీ ఇదే రాష్ట్రం. అంతేకాదు సాక్షాత్తు ఆయన కుమారుడే బీసీసీఐ కార్యదర్శి (జై షా). అయినా ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ కు ప్రేక్షకులు లేకపోవడం అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిందే. ఇది ఎవరి వైఫల్యమో అనేది పరిశీలన చేసుకోవాలి.
కొసమెరుపు..: సాధారణంగా తమ నగరాల్లో టెస్టు మ్యాచ్ లు జరిగితే కళాశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను మైదానాలకు తీసుకొస్తాయి. అలాంటి ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్నప్పటికీ నరేంద్ర మోదీ స్టేడియానికి విద్యార్థులనూ తీసుకురానట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. మైదానం బయట కూడా ప్రేక్షకులు ఎవరూ లేరు. దీనిని చూసిన హైదరాబాద్ వాసి ఒకరు.. ఈ మాత్రం మ్యాచ్ ను హైదరాబాద్ లో నిర్వహించినా జనం కిక్కిరిసేవారు కదా? అని వ్యాఖ్యానించాడు.