19 బంతుల్లోనే చేజింగ్.. -1.80 నుంచి +3.0కి రన్ రేట్.. ఇదో రికార్డు
భారత్ లో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన ఇంగ్లండ్ దారుణమైన ప్రదర్శన కనబర్చింది.
By: Tupaki Desk | 14 Jun 2024 7:46 AM GMTపసికూనతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు.. మేటి జట్టు చేతిలో పరాజయం.. మరొక్క మ్యాచ్ రద్దయినా ఇక ఇంటికే? ఇలాంటి పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టి20 ప్రపంచ కప్ లో దుమ్మురేపింది. పసికూన జట్టును చితక్కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అదికూడా కేవలం 19 బంతుల్లోనే టార్గెట్ చేజ్ చేసింది.
వన్డే ప్రపంచకప్ లో ఘోర పరాభవం
భారత్ లో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన ఇంగ్లండ్ దారుణమైన ప్రదర్శన కనబర్చింది. కనీసం క్వార్టర్స్ కు కూడా చేరుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లోనూ డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. అయితే, టోర్నీలో సూపర్-8 దశకు కూడా చేరుకోలేని పరిస్థితి ఎదుర్కొంది. గ్రూప్–బిలో ఉన్న ఈ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అంతకుముందు స్కాట్లాండ్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఈ పరిస్థితుల్లో ఎదురైన ఒమన్ ను ఇంగ్లండ్ చిత్తు చేసింది. ‘సూపర్ - 8’ రేసులోకి దూసుకొచ్చింది. ఒమన్ ను కేవలం 47 పరుగులకే ఆలౌట్ చేసింది. 3.1 ఓవర్లు (19 బంతులు)లోనే 50 పరుగులు చేసి టార్గెట్ అందుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ (24*: 8 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), ఫిల్ సాల్ట్ (12: రెండు సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో (8*: రెండు ఫోర్లు) దూకుడుగా ఆడారు. బౌలర్లు అదిల్ రషీద్ (4/11), మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12)లు ఒమన్ ను కుప్పకూల్చారు.
అతి స్వల్ప లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన ఇంగ్లండ్ ప్రపంచ కప్ లో రన్ రేట్ ను -1.80 నుంచి +3.081కు పెంచుకుంది. చివరి మ్యాచ్‌లో నమీబియాపై ఇంగ్లండ్ గెలవాలి. కాగా, టీ20 ప్రపంచకప్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా ఛేదన చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. 2014 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ పై లంక 90 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ 101 బంతుల ముందే టార్గెట్ పూర్తి చేసింది.
ఆ చిన్న జట్టు చేతిలోనే..
ఇంగ్లండ్ నమీబియాపై గెలిచినా.. ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడిపోవాలి. అప్పుడే ఇంగ్లిష్ జట్టుకు ‘సూపర్-8’ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ రన్ రేట్ +2.164. మూడు మ్యాచుల్లో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, స్కాట్లాండ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే.. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ పాయింట్లు సమం అయితాయి. రన్ రేటు మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్ సూపర్ 8కి వెళ్తుంది. నమీబియాపై ఓడినా, ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ గెలిచినా ఇంగ్లాండ్ ఇంటికే..